జానీ మాస్టర్‌కు రేణు దేశాయ్ స్వీట్ వార్నింగ్.. ‘వదిన’ అంటే ఊరుకోను!

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. పవన్ కళ్యాణ్ మాజీ సతీమణిగా ఆమెకు మెగా అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. విడిపోయి ఇన్నేళ్లవుతున్నా పవన్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఆమెను ప్రేమగా ‘వదిన’ అనే పిలుస్తుంటారు. అయితే, ఈ పిలుపుపై రేణు చాలా సందర్భాల్లో అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ భక్తుడు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు కూడా ఇదే విషయంలో ఆమె నుంచి ‘స్వీట్ వార్నింగ్’ తప్పలేదు.

అసలేం జరిగిందంటే..!

ఇటీవల ఓ సినిమా ఓపెనింగ్ వేడుకలో రేణు దేశాయ్, జానీ మాస్టర్, అనసూయ భరద్వాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ అనసూయను పలకరించిన తర్వాత, పక్కనే ఉన్న రేణు దేశాయ్‌ను చూసి అలవాటుగా “వదిన.. హాయ్” అని విష్ చేశారు. అంతే.. రేణు దేశాయ్ వెంటనే రియాక్ట్ అయ్యారు. నవ్వుతూనే జానీ మాస్టర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.

“వదిన కాదు.. అక్కా.. ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు” అంటూ రేణు దేశాయ్ మందలించారు. దీంతో జానీ మాస్టర్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వెంటనే తేరుకుని.. “అరెరే.. సారీ అక్కా.. లోపల నుంచి (భక్తితో) వచ్చేసింది.. అక్కా” అంటూ రెండు చేతులెత్తి దండం పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్‌ను దైవంగా భావిస్తారు కాబట్టి, ఆయన భార్యను వదిన అనడం సహజమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, తనకంటూ సొంత ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తున్న రేణు దేశాయ్.. ఆ పిలుపు వల్ల ఇబ్బంది పడుతున్నారని, ఆమె కోరికను గౌరవించాలని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, “వదిన” పిలుపు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a comment