తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై ఇప్పుడు కొత్త సందేహాలు మొదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్నా, ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఆర్థిక వనరులు ఇంకా తుది దశకు చేరకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
‘గోల్డెన్ సిటీ’గా హైదరాబాద్‌ను మారుస్తామన్న రేవంత్ రెడ్డి మాటలు, కేవలం ఫైళ్లు, సమీక్షలకే పరిమితమయ్యాయా అనే విమర్శలు విపక్షాల నుంచి, పౌర సంఘాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్ట్‌ను గుజరాత్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీనికోసం గతేడాది బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు కేటాయించి, ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యతను చాటుకున్నారు.
అంతేకాదు, మొత్తం రూ. 5,641 కోట్ల అంచనా వ్యయంతో తొలి దశ (ఉస్మాన్‌సాగర్/హిమాయత్‌సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 20.5 కి.మీ) పనులను త్వరలో డిసెంబర్ నుంచి ప్రారంభిస్తామని అధికారులను ఆదేశించారు. నదికి జీవం పోయడానికి, 2.5 టీఎంసీల స్వచ్ఛమైన గోదావరి జలాలను తరలిస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ప్రకటనలు, సమీక్షలు ఎంత జోరుగా సాగినా, అసలు కథ అంతా నిధుల్లోనే ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధుల్లో సింహభాగం, అంటే దాదాపు రూ. 4,100 కోట్లు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రుణ ఒప్పందానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ఇటీవల అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే, డిసెంబర్ నుంచి పనులు ప్రారంభం అవుతాయని అంతా ఆశించారు.
కానీ, తాజాగా వెలువడుతున్న సమాచారం ప్రభుత్వ మాటలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న భారీ గ్యాప్‌ను బయటపెడుతోంది. పౌర సంఘాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. అత్యంత కీలకమైన ఏడీబీ ఫండింగ్ ప్రాజెక్ట్ ఇంకా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫైనల్ లిస్ట్‌లో చేరలేదట! అంటే, అంతర్జాతీయ సంస్థ నుంచి రుణం మంజూరు ఇంకా ‘తూచ్’ అనే స్థితిలోనే ఉందనే ఆందోళన మొదలైంది.
ఒకవైపు కోట్లు ఖర్చు పెట్టి సింగపూర్ తరహా ‘గార్డెన్స్ బై ది బే’ను తలపించేలా ఐలాండ్స్, రిసార్ట్‌లు, థీమ్ పార్కులు నిర్మిస్తామని సీఎం చెబుతున్నారు. కానీ, కీలకమైన ఫండింగ్ లేకపోతే ఈ భారీ ప్రణాళికలు కేవలం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లకే పరిమితం అయ్యే ప్రమాదం ఉంది.
మరోవైపు, మూసీ పరివాహక ప్రాంతంలోని ఆక్రమణల తొలగింపు కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. నిర్వాసితులకు 2BHK ఇళ్లతో పాటు రూ. 25 వేల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ అడ్డుపడుతోంది. దీంతో, పనులు ప్రారంభంలోనే రాజకీయ ఆటంకాలు తప్పడం లేదు.
ఏది ఏమైనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూసీ ప్రాజెక్ట్ ఒక కల. కానీ, ఏడీబీ ఫండింగ్‌పై ఉన్న తాజా అస్పష్టత, రాజకీయ అడ్డంకులు, వేలాది మంది నిర్వాసితుల సమస్యలు.. ఈ ప్రాజెక్ట్ స్పీడుకు బ్రేకులు వేస్తున్నాయి. ప్రభుత్వం కేవలం సమీక్షలు, ప్రకటనలకే పరిమితం కాకుండా, ఫండింగ్ విషయంలో పూర్తి పారదర్శకతను ప్రకటించి, వాస్తవ పనులు వెంటనే ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

