టాలీవుడ్‌లో భారీ బడ్జెట్లు, స్టార్ హీరోల డామినేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ బడా బాబుల లెక్కలను తారుమారు చేస్తూ, కంటెంట్‌తోనే కలెక్షన్లు కొల్లగొట్టవచ్చని కొన్ని చిన్న సినిమాలు నిరూపించాయి. ఈ మధ్యే వచ్చిన లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి చిత్రాలు ఇందుకు తాజా ఉదాహరణ.
నిజానికి, ఈ రెండు చిత్రాలకు పెద్ద స్టార్ కాస్ట్ లేదు. గ్రాండ్‌గా ప్రొమోషన్స్ కూడా జరగలేదు. కానీ, కథలో దమ్ముంటే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని ఈ సినిమాలు మరోసారి రుజువు చేశాయి.
లిటిల్ హార్ట్స్: రూ. 2.4 కోట్ల బడ్జెట్‌తో రూ. 40 కోట్లు
‘90’s A Middle Class Biopic’ వెబ్ సిరీస్‌తో పేరు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించిన చిత్రం లిటిల్ హార్ట్స్. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కేవలం రూ. 2.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. సెప్టెంబర్ 5న విడుదలైంది.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ. 40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అంటే పెట్టుబడిపై 1200 శాతానికి పైగా లాభం సాధించింది.
ఈ ఏడాది అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా లిటిల్ హార్ట్స్ నిలిచింది. కంటెంట్ బాగుంటే, స్టార్‌డమ్ లేకపోయినా భారీ చిత్రాలకంటే ఎక్కువ వసూళ్లు చేయొచ్చని నిరూపించింది.
రాజు వెడ్స్ రాంబాయి: వారం రోజుల్లోనే లాభాలు
ఇక ఇటీవల (నవంబర్ 21న) విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి పరిస్థితీ అంతే. నీది నాది ఒకే కథ, విరాట పర్వం వంటి మంచి చిత్రాలు తీసిన వేణు ఊడుగుల, నిర్మాతగా మారి ఈ సినిమాను నిర్మించారు.
సాయిలు కంకిపాటి దర్శకత్వం వహించారు. వరంగల్, ఖమ్మం ప్రాంతాల సరిహద్దుల్లో జరిగిన నిజ జీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ. 2.5 కోట్లు. విడుదలైన తొలి 48 గంటల్లోనే బ్రేక్-ఈవెన్ దాటేసింది. మొదటి వారంలోనే రూ. 10 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి, లాభాల బాట పట్టింది. ముఖ్యంగా, రూ. 99 టికెట్ ధర వ్యూహం, గ్రామీణ నేపథ్యం, హృదయాన్ని హత్తుకునే కథ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ అయ్యాయి.
థియేటర్లలో పెద్ద సినిమాల సందడి లేని సమయంలో, కంటెంట్‌తో వచ్చిన ఈ చిన్న సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చింది. అందుకే, టాలీవుడ్‌లో ‘స్టార్ పవర్ కాదు, స్టోరీ యే పవర్’ అనే మాట మరోసారి బలంగా వినిపిస్తోంది.

