వైజాగ్ కు చెందిన రవి, చదువులో టాపర్. ఎంబీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ చేసి వెబ్ డిజైనింగ్‌లో దిట్టగా మారాడు. 2016లో ఓ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ, అక్కడే అసలు సినిమా మొదలైంది. అమ్మాయి అలవాట్లు, ఖర్చులను సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో రవి బ్యాలెన్స్ చేయలేకపోయాడు.
అవమానమే ఇంధనంగా..!
“నీకు సంపాదన చేతకాదు.. ఫ్యామిలీని పోషించడం రాదు” అంటూ భార్య, అత్తగారు రవిని దారుణంగా అవమానించారట. ఆ మాటలు రవి గుండెల్లో బాకుల్లా దిగాయి. “నేనేంటో చూపిస్తా” అనే కసితో , తన టెక్ తెలివితేటలను తప్పుడు దారిలో పెట్టాడు. అలా 2018లో ‘ఐబొమ్మ’ పుట్టింది.
కోట్ల డబ్బు , విదేశీ పౌరసత్వం..!
కొత్త సినిమాలను పైరసీ చేస్తూ, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ రవి కోట్లు గడించాడు. ఇండియన్ సిటిజన్‌షిప్ వదిలేసి, సెయింట్ కిట్స్ పౌరసత్వం తీసుకున్నాడు. “దమ్ముంటే పట్టుకోండి” అని పోలీసులకే సవాల్ విసిరాడు. కానీ, “పాప భీతి లేకున్నా.. పోలీస్ భీతి ఉండాలి” అన్నట్లు, చివరికి ఆస్తులు అమ్ముకోవడానికి ఇండియా వచ్చి సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్కెచ్‌కి అడ్డంగా దొరికిపోయాడు.
తండ్రి ఆవేదన..!
రవి అరెస్ట్ తర్వాత అతడి తండ్రి అప్పారావు గారు సీపీ సజ్జనార్‌కు ఒక ఎమోషనల్ రిక్వెస్ట్ చేశారు. “నా కొడుకు చేసింది తప్పే.. శిక్షించండి. కానీ వాడికి ఒక కూతురు ఉంది. ఆ చిన్నారి కోసమైనా రవిని మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి” అని వేడుకున్నారు. పాపం, కన్నపేగు కదా.. కొడుకు జైలు పాలైతే ఆ బాధ వర్ణనాతీతం.

