అమరావతిలో మరో తిరుమల.. రూ.185 కోట్లతో అద్భుత ఆలయం!

రాజధాని అమరావతికి కేవలం పరిపాలన కళే కాదు, ఆధ్యాత్మిక శోభ కూడా రాబోతోంది. గతంలో చంద్రబాబు సర్కార్ హయాంలో వెంకటపాలెం వద్ద కృష్ణా నది కరకట్టకు ఆనుకుని 25 ఎకరాల్లో శ్రీవారి ఆలయానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు బ్రేకులు వేసింది. రూ.150 కోట్ల బడ్జెట్‌ను కాస్తా రూ.36 కోట్లకు కుదించి, కేవలం ‘మమ’ అనిపించేలా చిన్న గుడి కట్టాలని నిర్ణయించింది. “అందలం ఎక్కించమంటే.. అటక ఎక్కించినట్లు” తయారైంది పరిస్థితి.

కానీ ఇప్పుడు సీన్ మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాత ఫైళ్లకు దుమ్ము దులిపింది. అమరావతిలో నిర్మించేది సాధారణ గుడి కాదు, సాక్షాత్తు ‘మినీ తిరుమల’ అని డిసైడ్ అయ్యింది. తాజా సమాచారం ప్రకారం, సుమారు రూ.185 కోట్లతో ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ప్రధాన ఆలయం ఎదుట ఏడంతస్తుల మహారాజ గోపురం, మిగిలిన మూడు దిక్కుల ఐదంతస్తుల గోపురాలు, మాడ వీధులు, కోనేరు అచ్చం తిరుమల కొండను తలపించేలా ఉండబోతున్నాయి.

దీనికి టీటీడీ (TTD) కూడా పచ్చజెండా ఊపేసింది. కేవలం రాతి కట్టడాలకే రూ.84 కోట్లు, భక్తుల సత్రాలు, అన్నదాన కాంప్లెక్స్ కోసం రూ.20 కోట్లు కేటాయించారు. సోలార్ లైటింగ్, నిత్య కైంకర్యాలు, ఉత్సవాలతో ఇక్కడ కూడా ‘ఏడుకొండల వాడి’ వైభవం వెల్లివిరియనుంది. మొత్తానికి అమరావతి ఇక అటు అడ్మినిస్ట్రేషన్, ఇటు డివోషన్ రెండింటికీ కేరాఫ్ అడ్రస్‌గా మారనుందన్నమాట!

Leave a comment