నటీనటులు: అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, అనీష్ కురువిల్లా తదితరులు.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: కుషేందర్ రమేష్ రెడ్డి
కథ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్: అనిల్ విశ్వనాథ్
దర్శకత్వం: నాని కాసరగడ్డ
నిర్మాతలు: శ్రీనివాస చిట్టూరి
కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అల్లరి నరేష్.. ‘నాంది’, ‘ఉగ్రం’ లాంటి సీరియస్ సినిమాలతో తన పంథా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఆ కోవలోనే ఇప్పుడు దర్శకుడు నాని కాసరగడ్డతో కలిసి పూర్తిగా హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించిన చిత్రమే ’12A రైల్వే కాలనీ’. ముఖ్యంగా, బ్లాక్‌బస్టర్ హిట్ ‘పొలిమేర’ ఫేమ్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
కానీ ఆయన రాసిన ఈ కథనం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఒక థ్రిల్లర్ చిత్రానికి ఉండాల్సినంత పదును, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఇందులో కొరవడింది. కథ మొత్తం వరంగల్‌లో జరుగుతుంది. కార్తీక్ (అల్లరి నరేష్) అనే అనాథ యువకుడు, రాజకీయ నాయకుడు టిల్లు (జీవన్ కుమార్) దగ్గర చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. కార్తీక్ తన పక్కింటికి వచ్చిన బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆరాధన (కామాక్షి భాస్కర్ల)తో ప్రేమలో పడతాడు.
ఆరాధన కల నెరవేర్చడానికి అవసరమైన ₹3 లక్షల కోసం కార్తీక్, టిల్లును ఆశ్రయిస్తాడు. టిల్లు ఇచ్చిన పార్శిల్‌ను ఆరాధన ఇంట్లో దాచడానికి వెళ్లిన కార్తీక్‌కు అక్కడ షాకింగ్ నిజాలు ఎదురవుతాయి. ఇంట్లో ఆరాధనతో పాటు ఆమె తల్లి డబుల్ మర్డర్ అయ్యి ఉంటారు. ఇక్కడి నుంచే హీరో, తన స్నేహితులతో కలిసి ఆ మిస్టరీని చేధించే పనిలో పడతాడు.
దర్శకుడు కథను సెటప్ చేయడానికి ఇంటర్వెల్ వరకు బాగా సాగదీశారు. లవ్ ట్రాక్ బలహీనంగా ఉంది. హీరో-హీరోయిన్ల మధ్య ఎమోషనల్ కనెక్ట్ పూర్తిగా మిస్సయ్యింది. పైగా, కామెడీ కోసం పెట్టారనిపించిన కొన్ని వల్గర్ డైలాగులు (ఉదాహరణకు, వాలీబాల్ గురించి వచ్చే సంభాషణలు) చిరాకు తెప్పించాయి. నరేష్ లాంటి హీరోకి ఇలాంటి బూతులు అవసరమా అని ప్రేక్షకులు ముక్కున వేలేసుకున్నారు. ఈ సినిమాలో మాటలు మాత్రం వీక్‌గా ఉన్నాయి.
ద్వితీయార్థం (సెకండ్ హాఫ్) లో కథ కాస్త వేగం పుంజుకున్నా, దర్శకుడు అనవసరమైన ట్విస్ట్‌లు ఇస్తున్నాననే భ్రమలో ప్రేక్షకులను గందరగోళానికి గురిచేశారు. హత్య కేసు దర్యాప్తులో పోలీస్ ఆఫీసర్ రాణా ప్రతాప్ (సాయి కుమార్) పాత్ర నిస్సత్తువగా మారిపోవడం, హీరోనే మొత్తం కేసును నడిపించడం లాజిక్కు దూరంగా అనిపించింది.
థ్రిల్లర్ సినిమాలకు చాలా ముఖ్యమైన ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ కూడా ఆశించిన స్థాయిలో లేవు. భీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం మాత్రమే కొన్ని సీన్లలో టెన్షన్‌ను పెంచి కాస్త ఉపశమనం ఇచ్చింది. పాటలు మాత్రం స్పీడ్ బ్రేకర్లలా అడ్డుపడ్డాయి.
నటీనటుల విషయానికి వస్తే, అల్లరి నరేష్ తన పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించినా, తెలంగాణ యాస, ఇన్-కన్సిస్టెంట్ పాత్ర చిత్రణ వల్ల నిలకడ లోపించింది. కామాక్షి భాస్కర్ల పాత్ర కూడా వీక్‌గా రాశారు. మొత్తం మీద, బలమైన కథాంశం ఉన్నా.. అయోమయమైన స్క్రీన్‌ప్లే, అసంపూర్తిగా అనిపించిన లాజిక్ల కారణంగా ’12A రైల్వే కాలనీ’ ప్రేక్షకుడికి పూర్తి థ్రిల్‌ను ఇవ్వలేకపోయింది.
ఫైనల్ గా..!
ఇది థ్రిల్ కాలనీ కాదు.. చిర్రెత్తించే కాలనీ..!
Sky C Rating : 1.75/5

