కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు: ప్రకాశ్ రాజ్‌పై బాలనటి ఆగ్రహం

2024 సంవత్సరానికి సంబంధించి కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రకటన మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఉత్తమ చిత్రంగా ఎంపికైనప్పటికీ, బాల నటుల విభాగంలో ఎలాంటి అవార్డులు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశ్ రాజ్ నేతృత్వంలోని జ్యూరీ తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు సినీ ప్రముఖులు, ముఖ్యంగా బాల నటులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

‘మలికాపురం’, ‘గు’ వంటి చిత్రాల్లో తన నటనకు ప్రశంసలు అందుకున్న బాలనటి దేవానంద జిబిన్, తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయంపై ఘాటుగా స్పందించింది. దేవానంద మైనర్ కావడంతో, ఆమె తల్లిదండ్రులు నిర్వహిస్తున్న ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. “పిల్లలకు అవార్డులు ప్రకటించేందుకు జ్యూరీ సభ్యులకు కళ్లు మూసుకుపోయాయి” అని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు, దేవానంద స్పందన:

అవార్డుల ప్రకటన అనంతరం జ్యూరీ చైర్మన్ ప్రకాశ్ రాజ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉత్తమ బాలల చిత్ర విభాగంలో పరిశీలనకు ఆరు సినిమాలు వచ్చినా, ఏవీ ప్రమాణాలకు అనుగుణంగా లేవని జ్యూరీ నిర్ణయించిందన్నారు. “చిన్న పిల్లల విభాగంలో మాకు ఒక్క మంచి సినిమా కూడా కనిపించలేదు, పిల్లలతో సినిమా తీసే ప్రయత్నం కూడా జరగలేదు” అని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. దర్శకులు, రచయితలు పిల్లలు కూడా సమాజంలో భాగమని, వారి ఆలోచనల గురించి సినిమాలు తీయాలని ఆయన సూచించారు.

ప్రకాశ్ రాజ్ చేసిన ఈ కామెంట్ల వీడియో క్లిప్‌ను పోస్ట్ చేస్తూ, దేవానంద జ్యూరీ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. “మీ కళ్లతో పిల్లల్ని దగ్గరగా చూడండి. అంతే కానీ ఇక్కడంతా చీకటిగా ఉందని మాత్రం చెప్పకండి” అంటూ ఆమె ఎదురుదాడికి దిగింది. ‘స్టానర్తి శ్రీకుట్టన్’, ‘ఫీనిక్స్’, ‘ఏఆర్‌ఎం’ వంటి చిత్రాల్లో పిల్లలు అద్భుతంగా నటించినా, వారిని గుర్తించకపోవడం సరికాదన్నారు. కనీసం ఇద్దరు బాల నటులకైనా అవార్డ్స్ ఇచ్చి ఉంటే, అది తనలాంటి ఎంతో మంది పిల్లలకు ప్రోత్సాహంగా ఉండేదని దేవానంద అభిప్రాయపడింది. “పిల్లల హక్కులను కాపాడుకోవాలి, మార్పు జరగాలి” అని ఆమె డిమాండ్ చేసింది.

దేవానంద వ్యాఖ్యలకు పలువురు మలయాళ సినీ దర్శకులు, నటులు మద్దతు తెలిపారు. దర్శకుడు వినేష్ విశ్వనాథ్ సహా పలువురు ప్రముఖులు జ్యూరీ అవార్డులు ఇవ్వకుండా పిల్లలకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నించడంపై విమర్శలు గుప్పించారు. దేవానంద జిబిన్ ధైర్యంగా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం మలయాళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a comment