చేవెళ్లలో టిప్పర్-ఆర్టీసీ బస్సు ఢీ:24 మంది మృతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. తాండూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న టీజీఎస్‌ఆర్‌టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సును ఎదురుగా అతివేగంగా వస్తున్న కంకర లోడుతో ఉన్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం ధాటికి బస్సు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.

ప్రమాద తీవ్రత పెరగడానికి లారీలో ఉన్న కంకరే ప్రధాన కారణమైంది. లారీ అదుపు తప్పి బస్సుపై ఒరిగిపోవడంతో, అందులోని కంకర లోడు మొత్తం బస్సు కుడివైపు, ముఖ్యంగా డ్రైవర్ వెనుక ఉన్న ఎనిమిది సీట్లపై ఉప్పెనలా పడింది. దీంతో ఆ సీట్లలో కూర్చున్న ప్రయాణికులు కంకరలో కూరుకుపోయి ఊపిరి ఆడక సంఘటనా స్థలంలోనే మరణించారు. మృతుల్లో బస్సు డ్రైవర్ దస్తగిరి బాబాతో పాటు, ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు ఉన్నారు. మృతుల్లో 10 నెలల చిన్నారి కూడా ఉండడం హృదయ విదారకం. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 నుంచి 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కంకరను తొలగించి ప్రయాణికులను బయటకు తీయడానికి మూడు జేసీబీలను ఉపయోగించారు. ప్రమాదం కారణంగా హైవేపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, వెంటనే హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

Leave a comment