జూబ్లీహిల్స్‌లో BRS షాక్! “ఆకురౌడీ” కామెంట్, “క్రెడిట్” పాలిటిక్స్ కొంపముంచాయా?

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఓటమికి కాంగ్రెస్ వ్యూహం కంటే బీఆర్ఎస్ సొంత తప్పిదాలే ఎక్కువగా కారణమయ్యాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా, ఈ ఎన్నికల బాధ్యతను పూర్తిగా తీసుకున్న కేటీఆర్‌కు పార్టీ నుంచే సరైన సహకారం అందలేదనేది ఓపెన్ సీక్రెట్. “క్రెడిట్ పాలిటిక్స్” ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఆ క్రెడిట్ మొత్తం కేటీఆర్‌కే వెళ్తుందన్న అసూయతో, కొందరు సీనియర్ నేతలు, గ్రేటర్ ఎమ్మెల్యేలు ప్రచారానికి దూరంగా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి.

అంతేకాకుండా, సొంత పార్టీలోనే “కోవర్టులు” ఉన్నారనే అనుమానాలు బలంగా ఉన్నాయి. పార్టీ వ్యూహాలు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ శిబిరానికి చేరిపోయాయని, ఇది ఓటమికి పెద్ద కారణమని పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.

మరోవైపు, ప్రచారంలో కేటీఆర్… నవీన్ యాదవ్‌ను ఉద్దేశించి “ఆకురౌడీ” అని చేసిన వ్యాఖ్య తీవ్రంగా బెడిసికొట్టింది. అనేక కేసులున్న వ్యక్తిని పార్టీలో చేర్చుకున్న కేటీఆర్, నవీన్ యాదవ్‌ను అలా పిలవడం ఏమిటని ప్రజల్లో వ్యతిరేక చర్చ జరిగింది. ఇది నవీన్ యాదవ్‌కు అదనపు మైలేజ్ తెచ్చిపెట్టింది.

దీనికి తోడు, కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో మైనారిటీ ఓట్లను ఏకం చేసింది. ఎంఐఎం పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం నవీన్ యాదవ్ గెలుపును సులభతరం చేసింది. ఎర్రగడ్డ, బోరబండ, షేక్‌పేట వంటి ప్రాంతాల్లో మైనారిటీ ఓట్లు మూకుమ్మడిగా హస్తానికి పడ్డాయి.

సానుభూతి పనిచేస్తుందనుకుంటే, సొంత పార్టీ నేతలే సహకరించకపోవడంతో బీఆర్ఎస్‌కు ఈ ఉపఎన్నిక కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ ఓటమి కేటీఆర్ నాయకత్వంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Leave a comment