జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జయభేరి! BRS కంచుకోట బద్దలుకొట్టిన నవీన్ యాదవ్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ శుక్రవారం ఉదయం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. మొత్తం 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. మొదటి రౌండ్ నుంచే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యం ప్రదర్శించారు.

ఈ ఆధిక్యం ప్రతి రౌండ్‌లోనూ పెరుగుతూ పోయింది. BRS అభ్యర్థి మాగంటి సునీత ఏ దశలోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. చివరికి, నవీన్ యాదవ్ 99,120 ఓట్లు సాధించగా, మాగంటి సునీత 74,462 ఓట్లతో సరిపెట్టుకున్నారు. దీంతో, కాంగ్రెస్ పార్టీ 24,658 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించింది.

బీజేపీ తరపున పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. కాగా, ఈ ఉప ఎన్నిక సిట్టింగ్ BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైంది. BRS పార్టీ ఆయన భార్య సునీతకు టికెట్ ఇచ్చి, సానుభూతి ఓట్లపై ఆశలు పెట్టుకుంది.

అయితే, అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం ఈ గెలుపును తమ ప్రభుత్వ పాలనకు ప్రజల ఆమోదంగా భావిస్తోంది. AIMIM పార్టీ కూడా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం నవీన్ యాదవ్ విజయానికి దోహదపడింది. ఈ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

Leave a comment