ఛత్తీస్గఢ్లో మంగళవారం సాయంత్రం పెను విషాదం చోటుచేసుకుంది. బిలాస్పూర్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ప్రాథమిక సమాచారం ప్రకారం ఆరుగురు ప్రయాణికులు మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిందిలా:
వివరాల ప్రకారం, కోర్బా ప్యాసింజర్ రైలు బిలాస్పూర్-హౌరా మార్గంలో వెళ్తుండగా, లాల్ఖదన్ స్టేషన్ సమీపంలో ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడికి ప్యాసింజర్ రైలుకు చెందిన పలు బోగీలు పట్టాలు తప్పాయి.
భారీగా సహాయక చర్యలు:
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు స్పందించారు. రైల్వే పోలీసులు, ఉన్నతాధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు (NDRF) ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. బోగీలలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రమాదం కారణంగా హౌరా-ముంబై వంటి కీలకమైన రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

