ఆంధ్రప్రదేశ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల తన కులాన్ని బట్టే ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి దక్కాయంటూ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన మంత్రి సుభాష్, తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను లక్ష్యంగా చేసుకున్నారు.
కేసీఆర్ పేరు ప్రస్తావించకపోయినా, ఆయనను ఉద్దేశిస్తూ “ఆ టీఆర్ఎస్ గద్ద ముక్కు పంతులు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంతులు అంటే ఎవరో అందరికీ తెలిసిన విషయమే కదా! ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇలా సంబోధించడం సరికాదంటూ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
మంత్రి సుభాష్ ఆగ్రహానికి ప్రధాన కారణం.. శెట్టి బలిజ రిజర్వేషన్ల వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో బీసీ (BC-B) జాబితాలో ఉండి, సంప్రదాయబద్ధంగా కల్లుగీత కార్మిక వృత్తిని పోషించే ఈ శెట్టి బలిజలను, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఓసీ జాబితాలోకి మార్చిందని మంత్రి ఆరోపించారు.
దీనిపై సుభాష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, “శెట్టి బలిజలను ఓసీల్లో చేర్చడం వల్ల వేల మంది జీవితాలు నాశనం అయ్యాయి. భావితరాల భవిష్యత్తు నాశనమైంది” అని వ్యాఖ్యానించారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవాలంటే ఆ చెట్టే లేకపోతే ఎలా అన్నట్లుగా, వెనుకబడిన వర్గానికి రిజర్వేషన్లు లేకుండా పోయాయని ఆయన పరోక్షంగా చురకలు అంటించారు.
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కాపులతో సమానంగా ఉండే శెట్టి బలిజలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఈ సెటిలర్ల ఓట్లను ఆకర్షించేందుకు, తన సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించేందుకే మంత్రి సుభాష్ ఈ కీలక అంశాన్ని లేవనెత్తినట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ‘వాడు, వీడు’ అంటూ తెలంగాణ ఉద్యమ నేతను సంబోధించడం రాజకీయ విలువలకు తగదంటూ బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఈ కుల రిజర్వేషన్ల వివాదం ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

