మాజీమంత్రి విడుదల రజినీకి మళ్ళీ స్థానం మార్పు?.. రేపల్లెకు జగన్ వ్యూహం.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మాజీమంత్రి, పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ విడుదల రజినీకి మరోసారి స్థానాచలనం తప్పదనే ఊహాగానాలు పార్టీ ముఖ్య నాయకుల నుంచి వినిపిస్తున్నాయి.2019 ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచి, సంచలనంగా మంత్రి పదవి దక్కించుకున్న రజినీ..అప్పటి నుంచి ఆమె రాజకీయ ప్రస్థానం నిలకడ లేకుండా మారింది.

జగన్ హయాంలో రజినీ రెండుసార్లు నియోజకవర్గాల మార్పును ఎదుర్కొన్నారు. 2019లో చిలకలూరిపేటలో మాజీమంత్రి ప్రతిపాటి పుల్లారావుపై అనూహ్య విజయం సాధించారు. గత ఎన్నికలకు ముందు ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా మాధవి చేతిలో ఏకంగా 53,000 ఓట్ల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత, జగన్ ఆమెను తిరిగి చిలకలూరిపేట నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా నియమించారు.

జగన్ ‘రేపల్లె’ ప్లాన్ వెనుక వ్యూహం

ఇప్పుడు, విడుదల రజినీని బాపట్ల జిల్లాలోని రేపల్లె నియోజకవర్గానికి పంపాలని జగన్మోహన్ రెడ్డి యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని వెనుక ప్రధాన రాజకీయ వ్యూహం ఉంది. రేపల్లెలో వరుసగా మూడు సార్లు గెలిచి, ప్రస్తుతం మంత్రిగా ఉన్న అనగాని సత్య ప్రసాద్ (టీడీపీ) ను ఓడించాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీసీ జనాభా అధికంగా ఉంది.

    బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలిగా, దూకుడు స్వభావం ఉన్న రజినీని అక్కడి నుంచి పోటీ చేయిస్తే, ఆమె దూకుడు ముందు అనగాని సత్యప్రసాద్ జోరుకు బ్రేకులు వేయవచ్చని, తద్వారా సిట్టింగ్ మంత్రిని ఓడించవచ్చని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

    రేపల్లెలో వైసీపీ పరిస్థితి

    గతంలో రేపల్లెలో వైసీపీ నుంచి మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ ఉండేవారు, కానీ ఆయన రాజ్యసభకు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఇన్‌చార్జిగా ఉన్న ఈవూరు గణేష్, మంత్రి అనగానిని ఢీ కొట్టే సామర్థ్యం ఉన్న నాయకుడు కాదని పార్టీ అంచనా వేస్తోంది. అందుకే, గణేష్ స్థానంలో రజినీకి రేపల్లె పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

    అయితే, ఈ కొత్త మార్పుకు వెళ్లడానికి విడుదల రజినీ ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇప్పటికే పలుమార్లు నియోజకవర్గ మార్పులు, భారీ పరాజయం ఎదుర్కొన్న ఆమె, మరోసారి స్థాన చలనంపై ఎలా స్పందిస్తారో, జగన్ తన వ్యూహాన్ని ఎలా అమలు చేస్తారో చూడాలి.

    Leave a comment