‘వారణాసి’ టైటిల్ గోల.. రాజమౌళి మాస్టర్ ప్లాన్! ట్విస్ట్‌తో వివాదం క్లోజ్

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ చిత్రం ‘వారణాసి’. టైటిల్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచీ దీని చుట్టూ ఏదో ఒక వివాదం తిరుగుతూనే ఉంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇటీవల తెరపైకి వచ్చిన టైటిల్ వివాదానికి చిత్ర యూనిట్ చాలా తెలివిగా చెక్ పెట్టింది.

రాజమౌళి టీమ్ ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్‌లో ‘వారణాసి’ టైటిల్‌ను అద్భుతంగా ప్రకటించారు. ఆ క్షణం నుంచే ఈ పేరు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో రిజిస్టర్ అయిపోయింది. కానీ, అదే టైటిల్‌పై అంతకుముందే ఒక చిన్న సినిమా నిర్మాత అభ్యంతరం వ్యక్తం చేశారు. రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత సిహెచ్. సుబ్బారెడ్డి ‘వారణాసి’ అనే పేరును 2023లోనే రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ పేరును 2026 వరకు రెన్యూవల్ కూడా చేశారు.

రాజమౌళి సినిమా టైటిల్ ప్రకటించగానే, సుబ్బారెడ్డి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ను ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా టైటిల్‌ను వాడుకోవడంపై ఫిర్యాదు చేశారు. ఇది జక్కన్న వంటి అగ్ర దర్శకుడి సినిమాకు పెద్ద అడ్డంకిగా మారింది.

రాజమౌళి స్మార్ట్ మూవ్: వివాదానికి చెక్

ఈ టైటిల్ వివాదంపై చర్చలు జరిగాయి. దీనిపై లీగల్ సమస్యలు లేదా ఎక్కువ ఆలస్యం లేకుండా రాజమౌళి టీమ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగులో మాత్రమే టైటిల్‌ను మార్చాలని నిర్ణయించారు.

తెలుగు వర్షన్ కొత్త టైటిల్ ను ‘రాజమౌళి వారణాసి’ గా మార్చారు.ఇతర భాషల్లో టైటిల్ ను ‘వారణాసి’ యధాతథంగా ఉంటుంది.

ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్‌మెంట్, భారీ ఈవెంట్ ద్వారా ‘వారణాసి’ అనే పేరు రాజమౌళి సినిమాగా ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయింది. తెలుగులో ‘రాజమౌళి’ అనే బ్రాండ్‌ను టైటిల్‌కు జోడించడం ద్వారా, తమ సినిమాకు ప్రత్యేకతను తీసుకురావడంతో పాటు, పాత టైటిల్ హక్కులు ఉన్న నిర్మాత అభ్యంతరాన్ని కూడా గౌరవించినట్లు అయింది. ఈ తెలివైన పరిష్కారం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

టైటిల్ వివాదం పరిష్కారమైనా, ‘వారణాసి’ చుట్టూ ఇతర వివాదాలు ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. ఇటీవల గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు కూడా కొందరు హిందూ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఆయనపై పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి.

అయినప్పటికీ, ఈ సినిమాపై అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. మహేష్ బాబు ‘రుద్ర’ పాత్రలో, ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో రాబోతున్న ఈ సినిమా 2027 సంక్రాంతికి లేదా సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

తెలుగు టైటిల్ వివాదం సద్దుమణగడంతో, ఇకపై ప్రమోషన్స్ మరింత వేగవంతం కానున్నాయి. మొత్తానికి, ‘రాజమౌళి వారణాసి’గా తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి ఈ విజువల్ వండర్ సిద్ధమవుతోంది.

Leave a comment