ఓవర్సీస్ లో హిట్, డొమెస్టిక్‌లో ఫట్! రామ్ మూవీకి యూఎస్ టూర్ మైనస్సా?

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ విడుదల తర్వాత హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే కలిసి చేసిన ప్రమోషన్ స్ట్రాటజీ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సాధారణంగా సినిమా విజయం సాధించిన తర్వాత చిత్ర యూనిట్ విదేశాలలో ప్రమోషన్స్ చేయడం కొత్తేమీ కాదు. కానీ, ఈ సినిమా విషయంలో మాత్రం ప్రమోషన్స్ టైమింగ్, లొకేషన్ ఎంపికపై అనుమానాలు మొదలయ్యాయి.

ఈ సినిమాకు ఓవర్సీస్‌లో (ముఖ్యంగా అమెరికాలో) బుకింగ్స్ బాగానే జరిగాయి. ఓవర్సీస్ మార్కెట్‌లో రికార్డు వసూళ్లు సాధించి, రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశం ఉండడంతో మూవీ యూనిట్ ఆ సక్సెస్‌ను క్యాష్ చేసుకునేందుకు వెంటనే అమెరికా ఫ్లైట్ ఎక్కింది. రామ్, భాగ్యశ్రీ భోర్సే అక్కడ పలు ఈవెంట్లలో పాల్గొని సందడి చేశారు.

అయితే, అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఒకవైపు అమెరికాలో ప్రమోషన్లు జరుగుతుండగా, మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయనే వార్తలు బయటికొచ్చాయి. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించినా, లాంగ్ రన్ విషయంలో డొమెస్టిక్ మార్కెట్‌లో ఎంతవరకు ముందుకెళ్తుందో ఇప్పుడే చెప్పలేం. అదీ కాక, తెలుగు రాష్ట్రాల్లోని బి, సి సెంటర్లలో కూడా అంతంత కలెక్షన్స్ వస్తున్నాయి.

దీంతో సినీ విశ్లేషకులు, ట్రేడ్ పండితులు భిన్న రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవర్సీస్‌లో కలెక్షన్లు బాగున్నాయి కాబట్టి, అక్కడ ప్రమోషన్స్ చేయడం కరెక్టే. కానీ, డొమెస్టిక్ మార్కెట్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా, పూర్తిగా అమెరికా టూర్‌పై దృష్టి పెట్టడం పెద్ద తప్పు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఓవర్సీస్ vs డొమెస్టిక్: ఎవరిది పైచేయి?

నిజానికి, తెలుగు సినిమాలకు మెజారిటీ రెవెన్యూ వచ్చేది తెలుగు రాష్ట్రాల నుంచే. విదేశీ వసూళ్లు సపోర్టివ్‌గా ఉంటాయే తప్ప, ప్రధాన ఆదాయ వనరుగా ఉండవు. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీమ్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకుల నాడిని పట్టుకోలేకపోయిందనేది ఓ ప్రధాన విశ్లేషణ. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా..2 రోజులకు 8 కోట్లు గ్రాస్ కూడా దాటకపోవడం కారణం సినిమా రిలీజ్ అయ్యాక ఇక్కడ కనీస స్థాయిలో పబ్లిసిటీ చేయలేకపోవడం పెద్ద మైనస్..!

రామ్, భాగ్యశ్రీ అమెరికాలో ఉన్న సమయంలో, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ముఖ్య పట్టణాల్లో కూడా ప్రెస్ మీట్లు, సక్సెస్ టూర్స్ నిర్వహించి ఉంటే డొమెస్టిక్ కలెక్షన్లకు బాగా హెల్ప్ అయ్యేది. పీక్ కలెక్షన్ల సమయంలో హీరో అందుబాటులో లేకపోవడం, కేవలం ఓవర్సీస్ గురించి మాట్లాడటం స్థానిక ప్రేక్షకులకు సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ కలగకపోవడం కూడా ఒక కారణం అయ్యుండొచ్చు.!

కొందరైతే, ‘ఓవర్సీస్ కలెక్షన్లు బాగా వచ్చాయి కాబట్టి, టీమ్ అక్కడికే వెళ్ళింది. డొమెస్టిక్ పట్ల శ్రద్ధ తగ్గించారు’ అని సరదాగా సెటైర్లు వేస్తున్నారు. ఒక సినిమా సక్సెస్ కోసం, ఓవర్సీస్, డొమెస్టిక్ మార్కెట్లు రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. డొమెస్టిక్‌లో పుంజుకోలేని కారణంగా, ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడంలో కొంత ఇబ్బంది పడిందనేది ట్రేడ్ వర్గాల మాట. ఈ సంఘటన భవిష్యత్తులో సినిమా ప్రమోషన్ స్ట్రాటజీలకు ఒక పాఠం లాంటిది. ఓవర్సీస్ కలెక్షన్ల మెరుపులో పడి, డొమెస్టిక్ మార్కెట్‌ను తేలికగా తీసుకోకూడదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Leave a comment