నిఖిల్ “స్వయంభూ”: ఓవర్సీస్ లో ₹7 కోట్ల రికార్డ్ బ్రేకింగ్ డీల్.!

యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ కెరీర్లో మరో మైల్‌స్టోన్ సాధించాడు. ‘కార్తికేయ 2’ తో పాన్-ఇండియా రేంజ్‌ను అందుకున్న నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభూ’ తో అంతర్జాతీయ మార్కెట్‌లో తన సత్తా ఏంటో చూపించాడు. ఏకంగా ₹7 కోట్ల భారీ మొత్తానికి ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు అమ్ముడైపోవడం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

మాములుగా అయితే, టాలీవుడ్‌లో కేవలం అగ్ర హీరోల (టైర్-1) సినిమాలకు మాత్రమే ఈ రేంజ్‌లో ఓవర్సీస్ డీల్స్ వస్తుంటాయి. కానీ, టైర్-2 కేటగిరీ హీరో అయిన నిఖిల్‌ సినిమాకు ₹7 కోట్లు దక్కడం అంటే ఇది ఒక అసాధారణ రికార్డు. ‘స్వయంభూ’ పై ప్రేక్షకుల్లోనే కాదు, డిస్ట్రిబ్యూటర్లలో కూడా ఎంత నమ్మకం ఉందో ఈ డీల్‌ స్పష్టం చేస్తోంది. ఓవర్సీస్ మార్కెట్‌లోని అగ్ర సంస్థ ‘ఫార్స్ ఫిల్మ్స్’ (Phars Films) ఈ భారీ డీల్‌ను సొంతం చేసుకుంది. ఈ మొత్తం నిఖిల్ కెరీర్‌లోనే అత్యధికం అని చెప్పవచ్చు.

‘కార్తికేయ 2’ తో ఉత్తరాది ప్రేక్షకులకు కూడా చేరువైన నిఖిల్‌, ‘స్వయంభూ’ సినిమాతో కచ్చితంగా తన మార్కెట్‌ను మరింత విస్తరించుకోగలడని నిర్మాతలు ధీమాతో ఉన్నారు. అందుకే ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, స్పానిష్, అరబిక్, చైనీస్ భాషల్లో సహా మొత్తం ఎనిమిది భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే అసలైన పాన్-ఇండియా విజన్.

‘స్వయంభూ’ అనేది ఒక భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా. భారత చరిత్రలో ఇప్పటివరకు తెలియని ఒక యోధుడి కథగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భువన్ మరియు శ్రీకర్ (పిక్సెల్ స్టూడియోస్) ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అగ్ర నిర్మాత ఠాగూర్ మధు సమర్పకుడిగా ఉన్నారు.

దర్శకుడు సినిమాను అద్భుతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కించారని తెలుస్తోంది. యాక్షన్, ఎమోషన్స్, సాంస్కృతిక నేపథ్యం మేళవింపుతో ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని యూనిట్ చెబుతోంది. ఈ సినిమా షూటింగ్ రెండు సంవత్సరాలుగా, మొత్తం 170 రోజుల పాటు గ్రాండ్‌గా, యుద్ధ సన్నివేశాలతో పాటు భారీ సెట్‌లలో జరిగింది. పనులు మొత్తం పూర్తయ్యాయని ఇటీవలే మేకర్స్ ప్రకటించారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే, ‘బాహుబలి’, ‘RRR’ వంటి చిత్రాలకు పనిచేసిన కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా, ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి సినిమాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం సమకూర్చడం సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక నిఖిల్ సరసన సంయుక్తా మీనన్ మరియు నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మొత్తానికి, ‘స్వయంభూ’ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగానే సంచలనం సృష్టిస్తోంది. ఈ పీరియడ్ వార్ డ్రామాను ఫిబ్రవరి 13, 2026 న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. బాక్సాఫీస్ వద్ద నిఖిల్ మరోసారి ఎలాంటి అద్భుతం చేస్తాడో చూడాలి.

Leave a comment