కూలీల ముసుగులో మావో వ్యూహం విఫలం! విజయవాడలో పట్టబడ్డ నక్సల్స్.

మావోయిస్టులకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు గట్టి దెబ్బ కొట్టారు. అడవులను వదిలి పట్టణాలను అడ్డాగా మార్చుకోవాలని చూసిన మావోల ప్లాన్‌ను, భద్రతా బలగాలు పప్పులో కాలేసినట్టు చేశాయి.

అసలేం జరిగిందంటే.. ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాల వేడి తట్టుకోలేకపోయిన నక్సల్స్, తమ కార్యకలాపాలను ఏపీలోకి మార్చాలని చూశారు. ఇందుకోసం విజయవాడ శివారులో నివాసం ఏర్పరుచుకున్నారు.

కూలీల వేషంలో ఉంటూ, సెంట్రల్ కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి బృందానికి చెందిన వారితో ఇక్కడ నెట్‌వర్క్ డెవలప్ చేయాలని చూశారు. కానీ, మన ఇంటెలిజెన్స్ బలగాలు వాళ్ల కదలికలను ట్రాక్ చేశాయి.

ప్రముఖ కమాండర్ హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత, పోలీసులు నగరాలపై ఫోకస్ పెట్టారు. గ్రేహౌండ్స్ , ఆక్టోపస్ వంటి ప్రత్యేక దళాలు రంగంలోకి దిగాయి. కూంబింగ్ చేసి, ఒకే చోట దాక్కున్న 27 మందిని పట్టుకున్నాయి.

ఈ ఆపరేషన్‌లో వారి వద్ద నుంచి 4 డంపింగ్‌లను (ఆయుధాలు, కమ్యూనికేషన్ మెటీరియల్స్ దాచిన స్థావరాలు) స్వాధీనం చేసుకున్నారు. విజయవాడతో పాటు ఎలూరు, కాకినాడలలో కలిపి మొత్తం 50 మందికి పైగా మావో అనుబంధులను అరెస్ట్ చేయడం ఒక చారిత్రక విజయం. భవిష్యత్తులో నగరాలను వాడుకోవాలన్న మావోల కల ఈ దెబ్బతో భగ్నమైంది.

Leave a comment