రివ్యూ : “ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో”

ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉండటం,వారికి ఒక సమస్య ఎదురవ్వడం,గోవా లేక ఇంకో టూరిస్ట్ ప్లేస్ కి వెళ్ళడం,రకరకాల పాత్రను తీసుకొచ్చి లౌడ్ కామిడీ చేస్తూ ఆ సమస్యను ఎదుర్కోవడం,మధ్యలోనో క్లైమాక్స్ లోనో స్పెషల్ సాంగ్ లు పెట్టడం ఈ మధ్య మన టాలీవుడ్ ప్రేక్షకులకు అలవాటు అయిన కామిడీ సినిమాల ఫార్మాట్ ఇది.

ఈ మధ్య ఇదే ఫార్మాట్ లో తీసి ప్రేక్షకుల మీద దాడి చేసిన మిత్రమండలిని ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు.

తెలుగు కామిడీ సినిమా పరిస్థితులు ఇలా ఉన్న సమయంలో పక్కా పల్లెటూరు నేపథ్యంలో తీసిన ఆర్గానిక్ కామెడీ సినిమా “ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో”..! సినిమా కథ అంతా శ్రీకాకుళం పరిధిలో ఉండే ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది ముఖ్యంగా, ఫోటోగ్రాఫర్ రమేష్ (తిరువీర్) మరియు ఆనంద్ (నరేంద్ర రవి) ల చుట్టూ తిరిగే కథ ఇది.

ఇక కథ విషయానికి వస్తే..మండల ఛైర్‌పర్సన్ అల్లుడు ఆనంద్ తన పెళ్లి సందర్భంగా ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్ బాధ్యతను రమేష్‌కు అప్పగిస్తాడు. కానీ, షూటింగ్ పూర్తయిన తర్వాత, ఆ వీడియో ఉన్న మెమరీ చిప్ పోతుంది.అక్కడి నుంచి మొదలయ్యే అసలు కథ సున్నితమైన కామెడీతో..అప్పుడప్పుడు భాగోద్వేగాల సన్నివేశాలతో ముందుకెళ్తుంది.ఎక్కడా వల్గారిటీ లేదు కేవలం మనల్ని ఎంటర్టైన్ చేసే అమాయకుల పాత్రలు తప్ప..

నిస్సందేహంగా, తిరువీర్ రమేష్ పాత్రలో ఒదిగిపోయారు. గిల్టీగా, అమాయకంగా ఉండే ఫోటోగ్రాఫర్‌గా ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఆయన కామెడీ టైమింగ్, భావోద్వేగాలు బాగున్నాయి.

మరోవైపు, కొత్త నటుడు నరేంద్ర రవి ఆనంద్ పాత్రలో అద్భుతంగా నటించారు. గోదావరి జిల్లా యాస, సహజమైన నటనతో ఆయన ఈ సినిమాలో సర్ప్రైజ్ ప్యాకేజీగా నిలిచారు.చాలా సీన్లలో తిరువీర్ ను కూడా డామినేట్ చేస్తాడు.సినిమాకు అతనే చాలా పెద్ద ఎస్సెట్. కామిడీ పాత్రలోనే కాదు తన ఆమాయకత్వం ,ఎమోషనల్ సన్నివేశాలలో టాప్ చూపిస్తాడు.భవిష్యత్ లో మంచి అవకాశాలు వచ్చేలాగే ఉన్నాయి ఈ సినిమాలో తన నటన చూశాక..

హీరోయిన్ శ్రావ్య పంచాయతీ సెక్రటరీ పాత్రకు తగ్గట్టు నటించింది.ఆనంద్ కు తనకు మధ్య జరిగే సన్నివేశాల్లో తన కామెడీ టైమింగ్ బాగుంది.తిరువీర్ పక్కన చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ కూడా చాలా బాగా చేసాడు.అక్కడక్కడా తన పంచ్ లు బాగా పేలాయి.మిగతా పాత్రలు కూడా పరిధిమేర బాగా నటించారు.

సాంకేతిక అంశాలు, విశ్లేషణ:

దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ ఎంచుకున్న కథ కొత్తది కాకపోయినా అయన రాసుకున్న కథనం ఫ్రెష్ ఫీలింగ్ ను ఇస్తుంది.అదనంగా, పల్లెటూరి వాతావరణాన్ని, అమాయకపు పాత్రలను సహజంగా చూపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. సురేష్ బొబ్బిలి సంగీతం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్.కథ నడతలో సంగీతం ఉన్న పాత్రలతో పాటు ప్రముఖ పాత్ర వహిస్తుంది.సోమశేఖర్ సినిమాటోగ్రఫీ పల్లె అందాలను చక్కగా చూపించారు.

అయితే, కథనం కొన్ని చోట్ల ఊహించే విధంగా ఉండటం మైనస్. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు కొంచెం సాగదీసినట్లు అనిపిస్తాయి. అయినప్పటికీ, సినిమాలోని కామెడీ, హృదయాన్ని తాకే ముగింపు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.ఇంత తక్కువ క్యారెక్టర్ లతో ఎక్కువ వినోదం పండించడం మామూలు విషయం కాదు ఈ విషయంలో డైరెక్టర్ ఫుల్ గా సక్సెస్ అయ్యాడు సినిమాలో బడ్జెట్ కంట్రోల్ మనకు కనపడుతుంది అయినా అది పెద్ద సమస్య కాదు చూసే ప్రేక్షకుడుకి.వినోదం ఆలా పండింది మరి సినిమాలో. ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ ఒక ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకునే రూరల్ రొమాంటిక్ కామెడీ.కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, నటీనటుల సహజ నటన, మంచి ఆర్గానిక్ కామిడీ ఆ లోపాలను కప్పి వేస్తుంది.

చివరగా..!

‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ కాదిది .. ‘ది గ్రేట్ ఆర్గానిక్ కామెడీ షో ‘..!

Sky C Rating : 2.85/5

Leave a comment