పూరి-సేతుపతి గుమ్మడికాయ కొట్టేశారు! టైటిల్ ఎప్పుడంటే?

కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో మోస్ట్ హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నేషనల్ స్టార్ విజయ్ సేతుపతి కాంబోనే. ‘లైగర్’ తర్వాత మళ్లీ తన స్టైల్‌లోకి వచ్చేశాడు పూరీ. అవును! ఆయన ఎప్పుడూ చెప్పే మాట ‘త్వరగా సినిమా పూర్తి చేయడమే’ కదా. సరిగ్గా అదే చేశాడు.

విజయ్ సేతుపతితో పూరీ తీస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ తాజాగా పూర్తైంది. కారుకు గుమ్మడికాయ కొట్టేశారు. కొన్ని నెలల కిందట మొదలైన ఈ ప్రాజెక్ట్‌ను.. పూరీ తన ప్లానింగ్‌తో అనుకున్న సమయాని కంటే ముందే చుట్టేశాడు. మాస్, హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు, ముఖ్యంగా పూరీ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఆయన నుంచి ఒక సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలమే అయింది మరి!

ఈ షూటింగ్ ముగింపు సందర్భంగా టీమ్ ఒక ఎమోషనల్ వీడియోను కూడా విడుదల చేసింది. అందులో విజయ్ సేతుపతి భావోద్వేగానికి లోనవుతూ, ఈ యూనిట్‌ను, పూరీ సార్‌ను చాలా మిస్ అవుతానని చెప్పడం అభిమానుల హృదయాలను తాకింది. తన సినిమా ప్రయాణంలో ఇది చాలా అద్భుతమైన అనుభవం అంటూ మక్కల్ సెల్వన్ కితాబిచ్చారు.

హీరోయిన్ సంయుక్త.. కీలక పాత్రలో టబు!

ఈ భారీ ప్రాజెక్ట్‌లో విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త నటిస్తోంది. ఆమె పాత్ర చాలా కొత్తగా, శక్తివంతంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ నటి టబు కనిపించబోతున్నారు. ఆమె పాత్ర ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. కన్నడ నటుడు దునియా విజయ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేశ్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగం.

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్లకు మ్యూజిక్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జేబీ నారాయణ్ రావు కొండ్రొల్ల కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం… ఇలా ఐదు భాషల్లో ఒకేసారి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు షూటింగ్ పూర్తయింది కాబట్టి… త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ ప్రకటించి ప్రమోషన్స్ ఊపందుకోనున్నాయి. ఆ టైటిల్ ఏమై ఉంటుందో అని సినీ ప్రియులంతా ఆసక్తిగా చూస్తున్నారు.

Leave a comment