ధనుష్ ‘తేరే ఇష్క్ మే’కు అదిరిపోయే తెలుగు టైటిల్!

తమిళ నటుడు ధనుష్‌కు భాషాభేదం లేదు. ఎక్కడ మంచి కంటెంట్ దొరికితే అక్కడ సినిమా చేసేస్తారు. తమిళంలో ఎంత బిజీగా ఉన్నా..బాలీవుడ్‌లోనూ స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నారు. ‘రాంఝణా’ తో హిందీ ప్రేక్షకులను మెప్పించిన ధనుష్, ఇప్పుడు మళ్ళీ అదే దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్‌ తో కలిసి ‘తేరే ఇష్క్ మే’ అనే హిందీ చిత్రంతో రాబోతున్నారు. ఈ సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు.

నిజానికి, ‘రాంఝణా’ సినిమా తెలుగులో విడుదల కాలేదు. కానీ, ఆ సినిమా సృష్టించిన ప్రభావాన్ని చూశాక, ధనుష్ కొత్త హిందీ సినిమాను పక్కాగా పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అందుకే ఈ కొత్త చిత్రానికి తెలుగులో ప్రత్యేకంగా టైటిల్‌ను ఖరారు చేశారు. ధనుష్ ‘తేరే ఇష్క్ మే’ సినిమాకు తెలుగులో ‘అమరకావ్యం’ అనే ప్యూర్ తెలుగు టైటిల్ పెట్టారు.

అమరకావ్యం అంటే ఆ మాత్రం ఉంటుంది!

టైటిల్ చూస్తేనే సినిమా కంటెంట్ ఎంత ఇంటెన్స్‌గా ఉంటుందో అర్థమవుతోంది. ఇది ఒక ప్యూర్ లవ్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా. ఇందులో ధనుష్ ‘శంకర్‌’ అనే పాత్ర పోషిస్తున్నారు. క్రితి సనన్ ‘ముక్తి’గా కన్పించనుంది. వారణాసి నేపథ్యంలో సాగే శంకర్‌, ముక్తిల ప్రేమకథ. విఫలమైన ప్రేమ తర్వాత శంకర్ ఎలా రగిలిపోయాడనే కథాంశంతో దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ దీన్ని రూపొందించారు.

నిజం చెప్పాలంటే, ఇది ‘రాంఝణా’ సినిమాకు ఒక స్పిరిచువల్ సీక్వెల్ అని చెప్పొచ్చు. ధనుష్ మరోసారి బ్రేకప్ లవర్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తుంటే, ఈ సినిమా రేంజ్ ఏంటో తెలుస్తోంది. యాక్షన్, ఎమోషన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్న ఈ చిత్రం నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో ‘అమరకావ్యం’ టైటిల్ చూశాక.. హింది సినిమాలకు కూడా ఇలాంటి మంచి టైటిల్స్ పెడితే బాగుంటుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ‘అమరకావ్యం’ తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చూడాలి.

Leave a comment