సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిష్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయమైన ఈ సినిమాపై ఇప్పుడు పెద్ద వివాదం రాజుకుంది. అక్టోబర్ 17, 2025న దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా ఆడకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.
స్క్రిప్ట్ దొంగిలించారంటూ ఆరోపణలు.
ఒక యువ అసిస్టెంట్ డైరెక్టర్..’తెలుసు కదా’ కథ తనదేనని, దర్శక నిర్మాతలు తన ఐడియాను దొంగలించి సినిమా తీశారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. 2020లోనే తాను ఈ కథను పలువురు సినీ ప్రముఖులకు వివరించానని ఆయన చెబుతున్నారు. దీనికి సాక్ష్యంగా, అప్పట్లో హీరోయిన్ సమంతతో తాను మాట్లాడిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లను లీక్ చేయడంతో ఈ వ్యవహారం వైరల్‌గా మారింది.
సమంత పేరు ఎందుకు లాగారు?
ఆ యువ రచయిత ఆరోపణ ప్రకారం, ఆయన కథ మొదట్లో మహిళా ప్రధానంగా రాసుకున్నారు. దాన్ని సమంత, నాని, గౌతమ్ తిన్ననూరి వంటి వారికి వినిపించారు. కానీ, ఆ తర్వాత ఆ కథాంశాన్ని మార్చి, మెయిల్ డెామినేటెడ్ కోణంలో దర్శకురాలు నీరజ కోన ‘తెలుసు కదా’గా రూపొందించారని ఆయన వాదన. ‘ఎస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్’ వంటి డైలాగుల్లోని థీమ్ కూడా తన ఒరిజినల్ ఐడియా నుంచే వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“నా స్క్రిప్ట్.. ఈ సినిమా రిలీజ్ అయిన రోజే చచ్చిపోయింది” అంటూ ఆ రచయిత రెడ్డిట్‌లో చేసిన పోస్ట్ టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, కేవలం చాట్ స్క్రీన్ షాట్ల ఆధారంగా ‘స్క్రిప్ట్ దొంగిలించారు’ అని నిర్ధారించలేమని విమర్శకులు అంటున్నారు.
మరోవైపు, సమంత అభిమానులు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. సమంత అంత బిజీ షెడ్యూల్‌లో ఉండి, ఈయన కథను దొంగలించి వేరే వారికి లీక్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఒకే ఆలోచన ఇద్దరికి రావడం సహజం, దాన్ని పెద్ద వివాదం చేయవద్దని కౌంటర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఈ వ్యవహారంపై సినిమా దర్శకురాలు నీరజ కోన లేదా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

