ఉలగనాయగన్ కమల్ హాసన్ అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు. ఆయన నడిచే ప్రయోగశాల. 27 ఏళ్ల క్రితమే.. ప్యాన్-ఇండియా అనే మాట సినీ పరిశ్రమలో లేని రోజుల్లోనే..కమల్ ఏకంగా గ్లోబల్ ప్రాజెక్ట్‌కు ప్లాన్ వేశారు. అదే ‘మరుదనాయగం’.
18వ శతాబ్దపు యోధుడు మహ్మాద్ యూసఫ్ ఖాన్ (అలియాస్ మరుదనాయగం) జీవితం ఆధారంగా ఈ చారిత్రక చిత్రాన్ని రూ. 80 కోట్ల భారీ బడ్జెట్‌తో 1997లో మొదలుపెట్టారు. ఆ రోజుల్లో ఈ మొత్తం భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధికం. ఈ సినిమా ప్రారంభోత్సవం ఎంత ఘనంగా జరిగిందంటే..బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు!
ఒక భారతీయ సినిమా లాంచ్‌కు బ్రిటిష్ రాణి రావడం అనేది చరిత్రలో నిలిచిపోయే అద్భుతం. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి, లెజెండరీ నటులు శివాజీ గణేషన్, అమ్రీష్ పురి వంటి సినీ, రాజకీయ ప్రముఖులు ఆ వేడుకకు వచ్చారు. కమల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాక, ప్రధాన పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నారు.
అలాగే, కన్నడ స్టార్ విష్ణువర్థన్, నసీరుద్దీన్ షా, సత్యరాజ్ వంటి భారీ తారాగణాన్ని ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారు. అయితే, కమల్ కల త్వరగానే ఆగిపోయింది. బ్రిటీష్ భాగస్వామ్య సంస్థ ‘అంత భారీ బడ్జెట్ రికవరీ కష్టం’ అంటూ మధ్యలోనే వైదొలగడంతో, ఎన్ని ప్రయత్నాలు చేసినా 1999లో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టక తప్పలేదు. కేవలం 30 నిమిషాల ఫుటేజ్ మాత్రమే మిగిలింది.
అయితే, తాజాగా ఈ సినిమాకు మళ్లీ మోక్షం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. గోవాలో జరిగిన ఐఎఫ్ఎఫ్ఐ (IFFI 2025) వేడుకకు హాజరైన కమల్ హాసన్… ‘ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ (VFX) సహాయంతో ‘మరుదనాయగం’ చిత్రాన్ని పూర్తి చేయడం సాధ్యమే’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ మాటలు కమల్ అభిమానులకు పండగే.
మరుదనాయగం పాత్రను తాను పోషించాలంటే, కథలో కాలాన్ని మార్చాల్సి ఉంటుందని, లేదా యువ హీరోను తీసుకోవాల్సి ఉంటుందని కమల్ హింట్ ఇచ్చారు. ఏదేమైనా, ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలైన ఈ ప్రాజెక్ట్ తిరిగి మొదలైతే… అది ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులకు ఒక గొప్ప వార్త అవుతుంది.

