ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత గర్వించదగిన చిత్రంగా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ను భావిస్తున్నారు. గత కొంతకాలంగా మాస్ డైరెక్టర్లతో కలిసి చేసిన రెడ్, వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ వంటి యాక్షన్ సినిమాలు అభిమానులను నిరాశపరిచిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి రామ్ తన కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి, ఫ్యాన్-ఐడల్ మధ్య ఉండే భావోద్వేగ బంధం నేపథ్యంతో వస్తున్న ఈ కథను ఎంచుకోవడం సరైన నిర్ణయం అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ సినిమాను నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. వాస్తవానికి ముందుగా నవంబర్ 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఒక రోజు ముందే వస్తున్నారంటే, మేకర్స్‌కు ఔట్‌పుట్‌పై ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థమవుతుంది. ‘క్షణం’ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ ‘సాగర్’ అనే వీరాభిమాని పాత్రలో నటిస్తుండగా, కన్నడ స్టార్ ఉపేంద్ర ‘సూర్య కుమార్’ అనే సూపర్ స్టార్ పాత్రలో కీ రోల్ పోషించారు. కథానాయికగా భాగ్యశ్రీ బోర్సే మెరిసింది.
ఈ వారం బాక్సాఫీస్ దగ్గర ‘ఆంధ్రా కింగ్ తాలూకా’కు తిరుగులేని సోలో ఛాన్స్ దొరికింది. కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ రీటా వంటి సినిమాలు ఉన్నప్పటికీ, వాటికి ప్రమోషన్స్ గానీ, ప్రేక్షకుల్లో బజ్ గానీ లేదు. కాబట్టి కలెక్షన్ల పరంగా రామ్ సినిమాకు మొదటి మూడు రోజులు మంచి అవకాశం ఉంది. సినిమా ఆడియో, ట్రైలర్‌కు ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఆడియోతో జనాల్లోకి బలంగా వెళ్లిన సినిమా ఇదేనని చెబుతున్నారు.
అయితే, రామ్‌కు చిన్నపాటి పోటీ మహేష్ బాబు క్లాసిక్ ఫిల్మ్ బిజినెస్‌మేన్ రీ-రిలీజ్ రూపంలో ఎదురవుతోంది. స్టార్ హీరోల రీ-రిలీజులకు ప్రస్తుతం వస్తున్న ఆదరణ చూస్తుంటే, ఇది చిన్న ప్రభావం చూపినా ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తంమీద, ఆంధ్రా కింగ్ తాలూకా ట్రైలర్ చూపించిన కథా బలం, ఫ్యాన్ ఎమోషన్స్‌తో బాక్సాఫీస్ వద్ద రామ్ గత ఫ్లాప్‌లను తుడిచిపెట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

