Review By : MB
నటీనటులు: రవితేజ- శ్రీలీల- నవీన్ చంద్ర- రాజేంద్ర ప్రసాద్- మురళి శర్మ- నరేష్- సముద్రఖని- నితిన్ ప్రసన్న- హైపర్ ఆది- అజయ్ ఘోష్ తదితరులు.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: విధు అయ్యన్న
మాటలు: నందు సవిరిగామ
నిర్మాతలు: నాగవంశీ సాయి సౌజన్య
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: భాను భోగవరపు
హీరో రవితేజ కి చివరి హిట్టు సినిమా ఏంటో ఆయన అభిమానులకే కాదు బహుశా ఆయనకి కూడా గుర్తురాని పరిస్థితి.అలా ప్లాప్ లతో కెరీర్ ను నెట్టుకొస్తున్నా వరుసగా సినిమాలను అందిపుచ్చుకోవడంలో మాత్రం ముందు ఉంటున్నాడు రవితేజ.ఈసారి భాను భోగవరపు అనే కొత్త దర్శకుడితో జతకట్టి మాస్ జాతర తో ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ ఈసారి అయినా హిట్టు కొట్టాడో లేదో చూద్దాం.
కథ విషయానికి వస్తే హీరో పోలీస్ విలన్ గంజాయి స్మగ్లర్.అతన్ని చివరికి ఎలా తుడముట్టించాడు అనేదే కథ.ఇలా ఎన్నో సినిమాల్లో చూసిన రొటీన్ కథతో తీసిందే మాస్ జాతర.కాకపోతే డైరెక్టర్ హీరో క్యారెక్టర్ రొటీన్ గా ఉంటుంది అనుకున్నాడు ఏమో..? రెగ్యులర్ పోలీస్ ఆఫీసర్ లా కాకుండా రైల్వే పోలీసు ఆఫీసర్ గా చూపించారు.బహుశా ఈ మార్పుతో మాత్రమే సినిమా ప్రేక్షకులు కొత్తగా ఫీల్ అవుతారని దర్శకుడు ఫీల్ అయివుండవచ్చు.
ఇక సినిమా విషయానికి వస్తే.సినిమా మొదలవ్వగానే మనం ఎలాంటి సినిమా చూడబోతున్నామో మొదటి రెండు సీన్ లతోనే ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తాడు దర్శకుడు.
ఫస్ట్ హాఫ్ స్లోగా మొదలయ్యి శివుడు క్యారెక్టర్ (నవీన్ చంద్ర) ఎంట్రీ తో సినిమా వేగం పుంజుకుంటుంది.హీరో విలన్ ల మధ్య క్లాష్ ఎపిసోడ్ లతో సినిమా మాస్ ప్రేక్షకులను కొంతసేపు బాగానే ఎంగేజ్ చేస్తుంది.ప్రీ-ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ మధ్య కొన్ని మంచి మాస్ మోమెంట్స్ పడ్డాయి.
హీరోయిన్ శ్రీ లీల విషయానికి వస్తే పెర్ఫార్మెన్స్ పరంగా కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు.హీరోయిన్ శ్రీ లీల ఎంట్రీ తోనే సినిమా వేగం తగ్గి చికాకు మొదలవుతుంది.శ్రీ లీల రవితేజ లవ్ ట్రాక్ అస్సలు బాగోలేదు.ఆమె గెటప్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. డజన్ల కొద్దీ సినిమాలు చేస్తున్నా శ్రీ లీల నటనలో మాత్రం వేరియేషన్స్ కనపడటం లేదు.తనకు డాన్స్ మాత్రమే వచ్చు కాబట్టి స్పెషల్ సాంగ్స్ చేయడం బెటర్.
రవితేజ నవీన్ చంద్ర మాత్రమే కాస్త ఎంగేజ్ చేస్తారు.రాజేంద్ర ప్రసాద్ కామెడీ పర్వాలేదు. ప్రీ క్లైమాక్స్ లో ఆ క్యారెక్టర్ ను ఒక హై ఇవ్వాలని చూసారు కానీ పెద్దగా పేలలేదు.అజయ్ ఘోష్,ఆది ద్వారా కొన్ని చోట్ల కామెడీ పంచ్ లు బాగానే పేలాయి.తారక్ పొన్నప్ప ప్రీ క్లైమాక్స్ ముందు వస్తాడు. పుష్ప 2 లాగే ఈ సినిమాలో కూడా సడెన్ ఎంట్రీ ఇస్తాడు.అయినా ఆ క్యారెక్టర్ పెద్దగా సినిమాకు ఉపయోగపడింది లేదు.
ఇక సంగీతం విషయానికి వస్తే భీమ్స్ పర్లేదు అనిపించాడు.AI సహాయంతో చక్రి వాయిస్ తో పాడించిన పాట బాగుంది.మిగతా పాటలు ఫ్లోలో కలిసి పోయాయి.బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్ ను బాగానే క్యారీ చేసింది కానీ గొప్ప ఔట్ పుట్ ఐతే మాత్రం కాదు. ఇంటర్వెల్ తర్వాత కూడా రొటీన్ గా సాగిపోవడం సినిమా మైనస్.BC థియేటర్ల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా పర్లేదు అనిపించొచ్చు.
మాస్ జాతర సినిమా పూర్తిగా రవితేజ ఎనర్జీ మీద ఆధారపడిన సినిమా.లక్ష్మణ్ క్యారెక్టర్ తనకు బాగానే అలవాటు అయినదే కాబట్టి ఈజీ గా చేసుకుంటూ పోయాడు. రవితేజ తప్ప మిగిలిన అంశాలు దాదాపుగా అన్నీ అరకొర ఔట్ పుట్ మాత్రమే వచ్చాయి. ఈ రకమైన మాస్-ఎంటర్టైన్మెంట్ సినిమాకు కొత్త కథ అవసరం ఉండకపోయినా ప్రెజెంటేషన్‌లో ఫ్రెష్‌నెస్ తప్పనిసరి. కానీ ఈ సినిమాలో అది ఇంచు మాత్రం కనిపించదు.దర్శకుడు ఈ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.కొత్త దర్శకుడు అయినా 15 ఏళ్ల క్రిందటి నుంచే ఎన్నో సార్లు చూసిన మాస్ సినిమానే మళ్ళీ తీసినట్టు అనిపించింది.
ఈ సినిమాలో దేవీప్రియ పేరుతో ట్విట్టర్లో హల్ చేసే ఓ సినిమా రిపోర్టర్‌పై గట్టిగానే సెటైర్లు పడ్డాయి. ఇది ప్రొడ్యుసర్ నాగవంశీ ఆలోచన అయిఉండొచ్చు . ఈ సినిమాలో ఆ దేవిప్రియకి గట్టిగానే తరంబ్రాలు పడ్డాయి . ‘‘దేవి ప్రియ మంచి ఊపు మీద ఉన్నాడు.. ఊపే వరకూ ఆపేలా లేరు.. లేపలేరూ’’, “సొంతపేరు పెట్టుకునే ధైర్యం లేదు కానీ.. ఫ్యాన్స్ వార్ చేస్తావ్ రా”, “చేతిలో ఉంటుంది లాటీ.. చేయడానికి ఉండదు డ్యూటీ” ఇలాంటి డైలాగ్‌లు ఆయన మీదే రాసినట్టున్నాయి.ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.ఎడిటింగ్ సరిగా లేదు.ముఖ్యమైన ఎమోషనల్ సీన్ ముగిసిన వెంటనే సాంగ్ రావడం/డ్యాన్స్ సీక్వెన్స్ రావడం సినిమా ఫ్లోను దెబ్బతీసింది. ఫోటోగ్రఫి బాగుంది.అంచనాలు లేకుండా ముందు ట్రైలర్ చూసి మనం ఏమి చూడబోతున్నాం అని ప్రిపేర్ అయితే మాత్రం ఒకసారి చూడొచ్చు.క్రాక్ లాగా కొంత కొత్తగా ఉంటుందిలే అని చూస్తే మాత్రం పూర్తి నిరాశ తప్పదు.
చివరగా..!
“మాస్ జాతర” ఎన్నో సార్లు చూసి చూసి అరిగిన “మూస జాతర”.!
Sky C Rating: 2.35/5

