ఆస్కార్ రేస్‌లో మహావిష్ణు నరసింహ.. భారత్‌కు చారిత్రక అవకాశం!

భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మరో చిత్రం ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మక వేదికపై నిలిచింది. దేశీయ యానిమేషన్ రంగంలో చరిత్ర సృష్టించిన మహావిష్ణు నరసింహ చిత్రం 98వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2026) బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి అర్హత  సాధించింది. ఇది నిజంగా భారతీయ సినీ చరిత్రలో ఓ అరుదైన, చారిత్రక ఘట్టం అనడంలో సందేహం లేదు.

దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ 2D-3D హైబ్రిడ్ సినిమాను క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మించగా, హోంబలే ఫిలింస్ (K.G.F., కాంతార లాంటి భారీ చిత్రాల నిర్మాత) సమర్పించింది. ఈ పౌరాణిక యాక్షన్ ఎపిక్ విష్ణుమూర్తి నాలుగో అవతారం, నరసింహ స్వామి కథను ఆధునిక యానిమేషన్ హంగులతో అద్భుతంగా చూపించింది.

ఈ సినిమా జూలై 25, 2025న హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలైంది. రిలీజ్ అయిన కొద్ది రోజులకే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం నరసింహ గర్జనను చూపించింది. అనూహ్యంగా.. ఈ చిత్రం భారత్‌లో ₹250 కోట్లకు పైగా నికర వసూళ్లు సాధించింది. దీంతో.. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. హాలీవుడ్ యానిమేషన్ దిగ్గజాలైన కుంగ్ ఫూ పాండా, స్పైడర్ మ్యాన్: ఇంటు ది స్పైడర్-వెర్స్ కలెక్షన్స్‌ను కూడా ఇండియాలో ఇది అధిగమించడం విశేషం.

ఇప్పుడు ఈ బ్రహ్మాండమైన చిత్రం గ్లోబల్ అవార్డు రేసులో మన దేశం తరఫున పోటీ పడుతోంది. ఈ కేటగిరీలో మొత్తం 35 సినిమాలు అర్హత పొందాయి. వీటిలో పిక్సార్ నుండి వచ్చిన ఎలియో (Elio), డ్రీమ్‌వర్క్స్ స్టూడియోస్ నుంచి వచ్చిన ది బ్యాడ్ గైస్ 2 (The Bad Guys 2), జూటోపియా 2 లాంటి భారీ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ 35 క్వాలిఫైయర్స్‌ నుంచి కేవలం పది చిత్రాలను మాత్రమే షార్ట్‌లిస్ట్ చేస్తారు.

అకాడమీ అవార్డ్స్ చరిత్రలో, 2001లో ఈ కేటగిరీ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏ భారతీయ యానిమేటెడ్ చిత్రం కూడా ఫైనల్ నామినేషన్‌కు చేరుకోలేదు. అందుకే, మహావిష్ణు నరసింహ కనుక నామినేషన్ పొందితే.. అది భారతదేశ సినీ పరిశ్రమకు దక్కిన చిరస్మరణీయ గౌరవం అవుతుంది. షార్ట్‌లిస్ట్ ఓటింగ్ త్వరలో (డిసెంబర్ 8-12, 2025) జరగనుండగా, నామినేషన్స్ ప్రకటన జనవరి 22, 2026న ఉంటుంది. యావత్ భారతీయ సినీ అభిమానులు ఇప్పుడు ఈ శుభవార్త కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Leave a comment