హైదరాబాద్: యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్’ ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేయడంతో, ఈ మిస్టికల్ మూవీకు మరింత హైప్ వచ్చింది.
యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ప్రారంభమే ఎంతో ఉత్కంఠగా ఉంది. వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన భీకర యుద్ధం ఈ కథకు మూలం అంటూ, సీనియర్ నటుడు సాయి కుమార్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఆకాశంలో జరిగిన ఆ యుద్ధం ఫలితంగా వచ్చిన ఒక అతీంద్రీయ శక్తి ఉల్కలాంటి రాయి రూపంలో ఓ గ్రామంలో పడుతుందని, దాని ప్రభావంతో ఆ ఊరిలో అనర్థాలు, వింత సంఘటనలు జరుగుతాయని ట్రైలర్ చూపించింది. ‘అగ్ని పురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి’ అనే డైలాగ్ కథ లోతును తెలియజేస్తోంది. ఈ మిస్టరీని ఛేదించడానికి, శాస్త్రానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విక్రమ్ (ఆది సాయికుమార్) ఆ ఊరికి వెళ్తాడు. సైన్స్ పరిధికి అందని ఈ అతీంద్రీయ శక్తులను అతను ఎలా ఎదుర్కొంటాడు, ఆ ప్రాచీన రహస్యాన్ని ఎలా విప్పుతాడు అనేదే సినిమా కథాంశంగా తెలుస్తోంది. ఆది సాయికుమార్ సైంటిస్ట్‌గా కొత్త, పవర్ ఫుల్ లుక్‌లో కనిపించి, తన నటనతో ఆకట్టుకున్నాడు. శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం కథ మూడ్‌ను, ఉత్కంఠను మరింత పెంచగా, ప్రవీణ్ కే బంగారి విజువల్స్ గ్రాండ్‌గా, అద్భుతంగా ఉన్నాయి.
‘శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్’ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వినూత్నమైన కాన్సెప్ట్ తో ఆది సాయికుమార్ ఈసారి గట్టి హిట్ కొట్టేలా ఉన్నాడని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

