గ్లోబల్ స్టార్డమ్ అందుకున్న రాజమౌళి, ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం ప్రపంచమే ఎదురుచూస్తోంది. ఇటీవల ‘గ్లోబ్‌ట్రాటర్’ పేరుతో భారీ ఈవెంట్ చేసి, వేలాది అభిమానుల మధ్య సినిమా టైటిల్‌ను ‘వారణాసి’గా ప్రకటించారు. దుర్గా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రకటన అదరహో అనిపించింది.
కానీ, ఈ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. “అంత పెద్ద డైరెక్టర్ మా టైటిల్ వాడేశారు” అంటూ ఓ చిన్న సినిమా యూనిట్ తెరపైకి వచ్చింది. గతంలో ‘రఫ్’ సినిమా తీసిన సి.హెచ్. సుబ్బారెడ్డి అనే దర్శకుడు ఇప్పుడు మరో సినిమా తీస్తున్నాడు. దానికి ‘వారణాసి’ అనే టైటిల్‌ను రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ బ్యానర్‌పై రిజిస్టర్ చేయించామని నిర్మాత విజయ్ కె. ఆరోపిస్తున్నారు.
ఆషామాషీగా కాదు, “ఇదిగో సాక్ష్యం” అంటూ ఫిల్మ్ ఛాంబర్ ఇచ్చిన లెటర్‌ను కూడా వారు బయటపెట్టారు. తమ అనుమతి లేకుండా రాజమౌళి తమ టైటిల్‌ను ఎలా ప్రకటిస్తారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నట్టు, ఇప్పుడు ఈ టైటిల్ వివాదం పెద్దదిగా మారింది.
ఇది చాలదన్నట్టు, రాజమౌళికి మరో తలనొప్పి కూడా మొదలైంది. ‘వారణాసి’ టైటిల్ ఈవెంట్లో హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు కూడా ఆయనపై ఫిర్యాదు చేశారు. మొత్తానికి, గ్లోబల్ ప్రాజెక్ట్ మొదలవుతుందనుకునే లోపే, జక్కన్న వరుస ఫిర్యాదులతో చిక్కుల్లో పడ్డారు.

