ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 | టైటిల్ పోరుపై ప్రత్యేక విశ్లేషణ
క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు అందరి దృష్టి ఐసీసీ మహిళల ప్రపంచకప్ ఫైనల్ పోరుపైనే. ఆదివారం నాడు దక్షిణాఫ్రికాతో తలపడే భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించేందుకు ఉరకలేస్తోంది. ఈ మహాద్భుత ఘట్టానికి చేరుకోవడానికి క్రీడాకారిణులు కేవలం మైదానంలోనే కాదు, అంతకుమించి తమ వ్యక్తిగత పోరాటాలు, తీవ్రమైన మానసిక సవాళ్లను కూడా జయించారు. గత వైఫల్యాల భారాన్ని మోస్తూ, విమర్శల అగ్నిపరీక్షను దాటుకుని వచ్చిన ఈ అసాధారణ యోధులు సాధించిన ఘనవిజయం వెనుక దాగి ఉన్న అంతరంగ కథనం ఇది.
జెమీమా రోడ్రిగ్స్: నిస్సత్తువ నుంచి పునరుత్థానం వరకు
ఆస్ట్రేలియాపై జరిగిన సెమీఫైనల్లో అసాధారణమైన అజేయ 127 పరుగుల శతకంతో భారత జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించిన జెమీమా రోడ్రిగ్స్ ప్రయాణం క్రీడాభిమానుల గుండెలను కదిలించింది. తన చారిత్రక ప్రదర్శన అనంతరం మీడియా వేదికగా జెమీమా పంచుకున్న తన ఆవేదన అత్యంత చర్చనీయాంశమైంది.
“ఈ టోర్నమెంట్ ప్రారంభంలో నేను తీవ్రమైన మానసిక ఆందోళనతో బాధపడ్డాను. నిస్సత్తువ ఆవరించడంతో, కొన్ని మ్యాచ్‌ల ముందు నా తల్లికి ఫోన్ చేసి దాదాపు ప్రతిరోజూ కన్నీళ్లు పెట్టుకునేదాన్ని,” అని జెమీమా బహిరంగంగా వెల్లడించింది. 2022 ప్రపంచకప్ జట్టు నుంచి తనను తొలగించడం, ఆ తర్వాత జట్టులో చోటు దక్కినా ఫామ్ లేకపోవడం ఆమెను నిరాశలోకి నెట్టింది. అయితే, ఆమె ఈ ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని, తన దైవ విశ్వాసం, తల్లిదండ్రులు, సహచరుల అండతో పోరాడింది. “నాకు నేనే చెప్పుకున్నాను..నువ్వు చేయగలిగింది ఒకటే, మైదానంలో నిలబడటం. మిగతాదంతా దైవం చూసుకుంటాడు,” అంటూ ఆమె వ్యక్తం చేసిన సంకల్పం కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు పోరాడి అజేయంగా నిలిచిన జెమీమా ఇన్నింగ్స్, వ్యక్తిగత సవాళ్లను జయించిన ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం.
హర్మన్‌ప్రీత్: నాయకత్వ పటిమకు ప్రతీక
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రయాణం కూడా నిరంతర ఒత్తిడికి, నాయకత్వ పటిమకు అద్దం పడుతుంది. జట్టును ముందుండి నడిపించే బాధ్యతతో పాటు, 2017 ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి భారం, కీలక నాకౌట్ మ్యాచ్‌లలో అనుకున్న స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయామనే వైఫల్యాల భారం ఆమెను వెంటాడేది. సెమీఫైనల్లో 89 పరుగుల పటిష్టమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు వెన్నుదన్నుగా నిలవడమే కాకుండా, విజయం తర్వాత ఆమె కన్నీళ్లు పెట్టుకున్న భావోద్వేగ దృశ్యం… గత ఏళ్ల నిరాశను, దానిని జయించిన అపూర్వమైన ఆనందాన్ని ప్రతిబింబించింది. నిరంతర విమర్శలు, ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని జట్టును మూడవసారి ఫైనల్‌కు చేర్చడంలో హర్మన్‌ప్రీత్ చూపిన అంకితభావం ప్రశంసనీయం.
స్మృతి మంధాన: భారం మోసిన భుజాలు
ఓపెనర్ స్మృతి మంధాన నుంచి అభిమానులు ప్రతీసారి భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తారు. సచిన్ టెండూల్కర్ వారసురాలిగా అభివర్ణించబడే స్మృతిపై ఉండే అంచనాల భారం చాలా ఎక్కువ. సెమీస్‌లో ఆమె త్వరగా నిష్క్రమించినా, టోర్నమెంట్ ఆసాంతం జట్టుకు పటిష్టమైన పునాదులు వేసిన ఘనత ఆమెదే. ప్రతి మ్యాచ్‌కు ముందు అంచనాలను మోయడం, దానిని స్థిరమైన ప్రదర్శనగా మార్చడానికి ఆమె చేసే అంతర్గత పోరాటం కనపడుతూనే ఉంది.
రిచా ఘోష్ & దీప్తి శర్మ: ఫైటింగ్ స్పిరిట్
మధ్యలో రిచా ఘోష్ (26), దీప్తి శర్మ (24) అందించిన విలువైన సహకారం.. జట్టులో ప్రతిభ, నిబద్ధత కలగలసి ఉన్నాయనేందుకు నిదర్శనం. వికెట్ కీపింగ్, ఫినిషింగ్ పాత్రలను సమర్థంగా నిర్వర్తించే రిచా, ప్రతీ మ్యాచ్‌లోనూ తన పాత్రను నిర్భయంగా పోషిస్తుంది. అలాగే, అనుభవజ్ఞురాలైన దీప్తి శర్మ.. బౌలింగ్, బ్యాటింగ్‌లలో స్థిరత్వాన్ని కొనసాగించడం, ఇతర క్రీడాకారిణులకు అండగా నిలవడం ద్వారా తమ పోరాటాన్ని కొనసాగిస్తారు.
భారీ ఛేదనలో ఆఖరి నిమిషంలో విజయాన్ని ఖాయం చేసిన యువ క్రీడాకారిణి అమన్‌జోత్ కౌర్. ఆమె కొట్టిన బౌండరీతోనే భారత్ చారిత్రక విజయాన్ని అందుకుంది. ప్రపంచకప్‌లో కీలక సమయంలో జట్టులో స్థానం సంపాదించుకుని, ఏ మాత్రం తొణకకుండా ఒత్తిడిని ఎదుర్కొని, విజేత షాట్ కొట్టడం కొత్తతరం ఆత్మవిశ్వాసాన్ని చాటింది. అనుభవం తక్కువైనా, క్షణాల వ్యవధిలో మ్యాచ్‌ను ముగించే బాధ్యతను సమర్థంగా నిర్వహించిన ఆమె ధైర్యం ప్రశంసనీయం.ఈ మహావిజయం ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లకే పరిమితం కాదు. జట్టులోని ప్రతి క్రీడాకారిణి కూడా తమవంతు పోరాటం చేశారు.
తుది పోరు: నిబద్ధతకు చారిత్రక ఋజువు
ఈ క్రీడాకారిణులందరి పోరాటాలు భారత జట్టులోని అలుపెరగని స్ఫూర్తిని తెలియజేస్తున్నాయి.బెంచ్‌కే పరిమితమవడం, ఫామ్ కోల్పోవడం వంటి కఠినమైన రోజులను చూసిన వీరు, ఇప్పుడు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ జట్టు విజయాన్ని మాత్రమే ప్రస్తుత లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆదివారం నాడు టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాతో తలపడే భారత మహిళా జట్టు, కోట్లాది మంది అభిమానుల ఆశలను మోస్తూ బరి లోకి దిగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్, వారికి ఒక కప్పు గెలుపు మాత్రమే కాదు, తమ వ్యక్తిగత కష్టాలకు, చేసిన త్యాగాలకు దక్కే చారిత్రక ఋజువుగా, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా నిలవనుంది.
అల్ ది బెస్ట్ టీం ఇండియా.. !

