డైరెక్టర్‌కు దివ్యభారతి షాక్! సుధీర్ మౌనంపై పరోక్ష విమర్శలు.!

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న ‘గోట్’ (GOAT) సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్ర దర్శకుడు నరేష్ కుప్పిలిపై హీరోయిన్ దివ్యభారతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా (X) వేదికగా సంచలన పోస్ట్ పెడుతూ, డైరెక్టర్‌ తనను ‘చిలక’ అని సంబోధించడాన్ని ఆమె తప్పుబట్టింది.

‘చిలక’ వంటి పదాలు కేవలం సరదాగా చేసిన వ్యాఖ్యలు కావని, అవి లోతుగా పాతుకుపోయిన స్త్రీ ద్వేషాన్ని (Misogyny) సూచిస్తాయని ఆమె స్పష్టం చేసింది. అంతేకాకుండా, నరేష్ కుప్పిలి సెట్‌లో కూడా మహిళలను అగౌరవపరిచే పద్ధతినే అనుసరించాడని దివ్యభారతి ఆరోపించింది. శిల్పం చెక్కేవాడు మనుషులను సరిగా చూడకపోతే, అదెలా కళ అవుతుంది? అన్నట్లు, ఈ దర్శకుడి తీరు కళకే ద్రోహం చేసేలా ఉందని ఆమె మండిపడింది.

అయితే, ఈ మొత్తం వ్యవహారంలో ఆమెను తీవ్రంగా నిరాశపరిచిన విషయం మరొకటి ఉంది. సహనటుడు సుడిగాలి సుధీర్ ఈ వివాదంపై ఏమాత్రం స్పందించకుండా మౌనంగా ఉండటాన్ని దివ్యభారతి ప్రశ్నించింది. సుధీర్ మౌనం వల్ల, ఇలాంటి గౌరవం లేని సంస్కృతి సెట్స్‌లో మరో రోజు బతకడానికి అవకాశం ఇచ్చినట్లయిందని ఆమె బాధపడింది.

అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడకపోవడం కూడా ఆ అన్యాయాన్ని ప్రోత్సహించడమే అవుతుందని ఆమె పేర్కొంది. అందుకే, తాను మెరుగైన వాతావరణాన్ని ఎంచుకుంటానని, అక్కడ మహిళలు పరిహాసానికి గురికారని, ప్రతి గొంతుకు గౌరవం ఉంటుందని తేల్చి చెప్పింది. ఇది కేవలం తన ఎంపిక కాదని, ఒక ఆర్టిస్ట్‌గా, ఒక మహిళగా తన ప్రమాణం అని ఆమె పేర్కొంది.

దివ్యభారతికి ఇతర నటీనటులతో సమస్యలు ఉన్నాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. దీనికి ఆమె గట్టిగా బదులిచ్చింది. తమిళ సినిమాల్లో తాను పదే పదే అదే టీమ్‌తో పనిచేశానని, అక్కడ ఎటువంటి వివాదాలు లేవని, కేవలం ఈ ఒక్క దర్శకుడు మాత్రమే హద్దులు దాటాడని తేల్చి చెప్పింది. మొత్తానికి, పని ప్రదేశంలో గౌరవం ఎంత ముఖ్యమో ఈ ‘గోట్’ వివాదం మరోసారి రుజువు చేసింది.

Leave a comment