హైదరాబాద్‌లో సంచలనం: భయంకరమైన ‘రైసిన్’ విషంతో టెర్రర్ ప్లాన్.. డాక్టర్ అరెస్ట్!

హైదరాబాద్ నగరంలో మరోసారి ఉగ్రవాద మూలాలు కలకలం రేపాయి. దేశవ్యాప్తంగా దాడులకు కుట్ర పన్నుతున్న ఒక ఉగ్రవాద మాడ్యూల్‌ను గుజరాత్ ATS ఛేదించింది.

ఈ కేసుకు సంబంధించి రాజేంద్రనగర్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను అధికారులు అరెస్టు చేశారు. ఇతనికి ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని ఏటీఎస్ వర్గాలు తెలిపాయి.

భయంకరమైన ‘రైసిన్’ కుట్ర

దర్యాప్తులో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్ సయ్యద్ తన గదిలోనే ‘రైసిన్’ అనే అత్యంత ప్రమాదకరమైన విషాన్ని తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషం సైనైడ్ కంటే కూడా చాలా ప్రాణాంతకమైనది.

ఈ విషాన్ని ఉపయోగించి సామూహిక హత్యలకు పాల్పడాలని వారు ప్లాన్ చేశారు. ఇందుకోసం లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్‌లోని రద్దీ ప్రాంతాల్లో ఈ బృందం రెక్కీ కూడా నిర్వహించినట్లు సమాచారం.

డాక్టర్ సయ్యద్ పాత్ర ఈ విషం తయారీకే పరిమితం కాలేదు. ఇతను ఆయుధాలు, నిధుల సేకరణలో కూడా చురుకుగా పాల్గొన్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మహ్మద్ సుహేల్ సలీంఖాన్ అనే ఇద్దరితో కలిసి పనిచేస్తున్నాడు.వారిని కూడా ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. తుపాకులు, బుల్లెట్లను హైదరాబాద్‌కు తరలించి, దాడులకు ఉపయోగించాలని వీరు ప్లాన్ చేశారు.

అంతేకాకుండా, ఈ టెర్రర్ మాడ్యూల్‌ కోసం యువకులను రిక్రూట్ చేసే బాధ్యత కూడా డాక్టర్ సయ్యద్ చూసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ 2007లో చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. అంతకుముందు ఖమ్మం, వరంగల్‌లో చదువుకున్నాడు.

చైనా నుండి తిరిగి వచ్చిన తరువాత, అతను హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. ఆన్‌లైన్ మెడికల్ కన్సల్టెన్సీని నడుపుతున్నాడు. అత్తాపూర్‌లోని ఒక హోటల్‌లో వ్యాపార భాగస్వామిగా కూడా ఉన్నాడు.అయితే, అతను ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడైనట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అనంతరం ఈ కుట్రలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించాడు.

పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో గుజరాత్ ఏటీఎస్ అధికారులు సకాలంలో స్పందించారు. వారి చర్యతో దేశం ఒక పెను ప్రమాదం నుండి బయటపడింది.ప్రస్తుతం డాక్టర్ సయ్యద్ గుజరాత్ ఏటీఎస్ కస్టడీలో ఉన్నాడు. ఈ ఉగ్రవాద నెట్‌వర్క్‌లోని మిగిలిన సభ్యుల కోసం దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

Leave a comment