“ఆ సీన్స్ చేయనన్నా.. బలవంతం చేశారు”: చాందిని చౌదరి సంచలనం

‘కలర్ ఫోటో’, ‘గామి’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి చాందిని చౌదరి, తాజాగా తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ షాకింగ్ సంఘటనను బయటపెట్టారు. తన కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

కెరీర్ ప్రారంభంలో తాను ఒక సినిమాకు సంతకం చేశానని చాందిని తెలిపారు. మొదట కథ చెప్పినప్పుడు ఎక్కడా ముద్దు సన్నివేశాల (Kiss Scenes) ప్రస్తావన లేదన్నారు.

అయితే, షూటింగ్ స్పాట్‌కు వెళ్లాక, ఆ సీన్‌లో నటించాలని దర్శకుడు, ఇతర సిబ్బంది పట్టుబట్టారు. “అర్జున్ రెడ్డి సినిమా తర్వాత అలాంటి సీన్స్ ఉంటే సినిమాకు హైప్ వస్తుందని నాతో అన్నారు,” అని చాందిని పేర్కొన్నారు.

తాను ఆ సన్నివేశంలో నటించడానికి సుముఖంగా లేనని స్పష్టంగా చెప్పాను. అయినప్పటికీ, వారు తనపై ఒత్తిడి ఆపలేదు. “మీరు ఇలా చేయకపోతే అది అన్‌ప్రొఫెషనల్ అవుతుంది” అంటూ తనను భయపెట్టే ప్రయత్నం చేశారని ఆమె వాపోయారు.

ఆ సమయంలో ఏమి చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డానని అన్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, తన సహనటుడైన హీరో తనకు అండగా నిలిచారని చాందిని వెల్లడించారు.

“అదృష్టవశాత్తూ, ఆ హీరో గారు నాకంటే ముందే ఆ సీన్ తాను కూడా చేయనని దర్శకనిర్మాతలకు గట్టిగా చెప్పారు. దాంతో వారు నన్ను మరింత బలవంతం చేయలేకపోయారు,” అని ఆమె తెలిపారు. ఆ హీరో మద్దతు వల్లే తాను ఆ ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడగలిగానని చాందిని స్పష్టం చేశారు.

Leave a comment