ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. మహేష్ బాబు మేనల్లుడికి అజయ్ భూపతి దర్శకత్వం!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబం నుండి మరో వారసుడి ప్రవేశానికి రంగం సిద్ధమైంది. మహేష్ బాబు, సుధీర్ బాబు, అశోక్ గల్లాల తర్వాత, ఇప్పుడు మరో యువకుడు హీరోగా రానున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడు అయిన ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.

ఈ క్రేజీ ప్రాజెక్టుకు ‘RX 100’, ‘మంగళవారం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. లెజెండరీ నిర్మాత అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్) ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అలాగే, ‘చందమామ కథలు’ బ్యానర్‌పై కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు ఒక పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పేరు ఇది. ఈ సినిమా తిరుపతి నేపథ్యంలో సాగే ఒక ప్రేమకథగా ఉండబోతుందని సమాచారం. త్వరలోనే ఈ టైటిల్‌పై అధికారిక ప్రకటన రానుంది.

ఇదిలా ఉండగా, దర్శకుడు అజయ్ భూపతి ఈ డెబ్యూ హీరో కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జయకృష్ణకు నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ వంటి అంశాలలో అజయ్ భూపతి దగ్గరుండి శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రష తడానీ పేరును పరిశీలిస్తున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది.

ఘట్టమనేని ఫ్యామిలీ అండ, అజయ్ భూపతి దర్శకత్వం, అశ్వినీదత్ సమర్పణ వంటి అంశాలు సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.

Leave a comment