జానీ మాస్టర్‌పై చిన్మయి సంచలనం.. ‘నాకు ఆయన భార్య ఫోన్ చేస్తున్నారు’!

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఉన్న లైంగిక వేధింపుల కేసు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సింగర్ చిన్మయి శ్రీపాద ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియా ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన విషయాలు బయటపెట్టారు.

ఈ కేసు చాలా సంక్లిష్టమైనదని చిన్మయి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇది కేవలం వేధింపుల కేసు మాత్రమే కాదని, “సెక్సువల్ గ్రూమింగ్” (నమ్మించి లోబరుచుకోవడం) జరిగిందని ఆమె ఆరోపించారు. జానీ మాస్టర్ మైనర్ బాలికను వేధించడమే కాకుండా, ఆమె లొంగకపోవడంతో పనిచేసే చోట బెదిరింపులకు గురిచేశాడని అన్నారు.

బాధితురాలి వయసు అప్పుడు 16 ఏళ్లు మాత్రమేనని చిన్మయి స్పష్టం చేశారు. అందువల్ల, దీనిని “పరస్పర అంగీకారం”తో జరిగిన సంబంధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, కానీ చట్టప్రకారం మైనర్ సమ్మతి చెల్లదని ఆమె అన్నారు.

అంతేకాకుండా, చిన్మయి ఒక కొత్త విషయాన్ని బయటపెట్టారు. తాను ఈ విషయం గురించి పోస్ట్ పెట్టిన ప్రతిసారీ జానీ మాస్టర్ భార్య ఆయేషా తనకు ఫోన్ చేస్తున్నారని తెలిపారు. తన భర్త నిర్దోషి అని, ఈ విషయం గురించి మాట్లాడటం ఆపాలని ఆమె కోరుతున్నట్లు చిన్మయి వెల్లడించారు.

ఇటీవల జానీ మాస్టర్, ఏఆర్ రెహమాన్‌తో కలిసి పనిచేసిన ఫోటోలను పంచుకున్నారు. దీనిపై చిన్మయి ఇండస్ట్రీ తీరును విమర్శించారు. అయితే, తాను ఏఆర్ రెహమాన్‌ను సంప్రదించగా, ఆయనకు ఈ కేస్ తీవ్రత గురించి “ఎలాంటి సమాచారం లేదు” అని చెప్పినట్లు చిన్మయి తెలిపారు.

2024 సెప్టెంబర్‌లో ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఆయన్ను అరెస్ట్ కూడా చేశారు, కానీ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ ఆరోపణల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రకటించిన జాతీయ అవార్డును కూడా సస్పెండ్ చేసింది.

జానీ మాస్టర్ తన డబ్బు, పలుకుబడితో కేసు నుండి బయటపడతారేమోనని చిన్మయి ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు ఆమె తన పోస్ట్ ముగించారు. ఈ తాజా ఆరోపణలపై జానీ మాస్టర్ ఇంకా స్పందించలేదు.

Leave a comment