తెలుగు సినిమా ఇండస్ట్రీకి అతి పెద్ద తలనొప్పిగా మారిన ‘ఐ-బొమ్మ’ వెబ్‌సైట్ అడ్మిన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం ఒక పెద్ద విజయం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ వి.సి. సజ్జనార్ సోమవారం (నవంబర్ 17) ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
పైరసీపై యుద్ధం ప్రకటించిన పోలీసులకు అండగా నిలిచేందుకు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు వంటి ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతా ‘ఐ-బొమ్మ’ అరెస్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్న సమయంలో, నాగార్జున మైక్ తీసుకుని ఒక సంచలన నిజాన్ని బయటపెట్టారు.
అదే ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్. ఈ కొత్త రకం సైబర్ మోసం గురించి ఈ మధ్య మనం వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ స్కామ్ ఏకంగా అక్కినేని కుటుంబం తలుపు తట్టింది.
నాగార్జున స్వయంగా మాట్లాడుతూ, “మా కుటుంబ సభ్యుల్లో ఒకరిని ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో సైబర్ నేరగాళ్లు ఇబ్బంది పెట్టారు. వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి వాళ్ళు కూడా మోసపోయారు” అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘కింగ్’ ఫ్యామిలీకే ఇలాంటి చెక్ పెట్టారంటే, ఈ మోసగాళ్లు ఎంతటి కంత్రీగాళ్లో అర్థం చేసుకోవచ్చు.
ఏమిటీ ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్?
ఇదొక తెలివైన మోసం. ముందుగా మీకు ఒక అన్-నోన్ నంబర్ నుండి కాల్ వస్తుంది. తాము సీబీఐ, ఈడీ, లేదా కస్టమ్స్ ఆఫీసర్లమని పరిచయం చేసుకుంటారు.
మీ పేరు మీద ఒక పార్శిల్ వచ్చిందని, అందులో డ్రగ్స్, పాస్‌పోర్టులు, లేదా ఇతర నిషేధిత వస్తువులు దొరికాయని బెదిరిస్తారు. మీ ఆధార్ కార్డు తీవ్రవాదులు వాడుతున్నారని కూడా చెప్పవచ్చు.
ఆ తర్వాత, మిమ్మల్ని భయపెట్టి, ఈ కేసు నుండి బయటపడాలంటే తాము చెప్పినట్లు చేయాలని ఆదేశిస్తారు. వెంటనే స్కైప్ లేదా వాట్సాప్ వీడియో కాల్‌లోకి రమ్మంటారు. మీరు ఏం చేస్తున్నారో వారికి లైవ్‌లో కనిపించేలా మిమ్మల్ని ‘డిజిటల్ అరెస్ట్’ చేశామని ప్రకటిస్తారు. మీరు ఎవరికీ కాల్ చేయకూడదని, ఎవరితో మాట్లాడకూడదని హెచ్చరిస్తారు. ఇలా కొన్ని గంటల పాటు మిమ్మల్ని మానసికంగా హింసించి, భయంతో చావగొట్టి, ఆ తర్వాత కేసు ‘సెటిల్’ చేసుకోవడానికి లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తారు. భయపడిపోయిన బాధితులు, అందులోనూ చదువుకున్న వాళ్లే ఎక్కువగా, వారి అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసి మోసపోతున్నారు.
నాగార్జున కుటుంబానికి చెందిన వ్యక్తే ఈ వలలో పడ్డారంటే, ఈ స్కామ్ తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో గత కొద్ది వారాల్లోనే ఇలాంటి కేసులు డజన్ల కొద్దీ నమోదయ్యాయి. కొందరు రిటైర్డ్ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు.
పోలీస్ కమీషనర్ సజ్జనార్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ, ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ ప్రభుత్వ ఏజెన్సీ కూడా ఇలా ఫోన్లలో, స్కైప్ కాల్స్‌లో అరెస్టులు చేయదని, డబ్బులు అడగదని స్పష్టం చేశారు. నాగార్జున కూడా, “టెక్నాలజీ పెరిగే కొద్దీ, నేరగాళ్లు కూడా అప్‌డేట్ అవుతున్నారు. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘దొంగలు పడిన ఆరు నెలలకు’ కాకుండా, ఇలాంటి మోసాలు జరుగుతున్నప్పుడే స్పందించి, ధైర్యంగా 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయడం ఒక్కటే మార్గం.

