అనర్హతపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు డెడ్‌లైన్; 4 వారాల్లో తేల్చకుంటే..!?

తెలంగాణలో BRS నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీంకోర్టు నుంచి గట్టి షాక్ తగిలింది. “ఇది కోర్టు ధిక్కరణలోకెల్లా దారుణమైనది” అని వ్యాఖ్యానించిన అత్యున్నత న్యాయస్థానం, స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

విషయం ఏమిటంటే, ఈ ఏడాది జూలై 31నే సుప్రీంకోర్టు.. స్పీకర్ ఈ అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా, అంటే అక్టోబర్ 31 లోపు, నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కానీ, గడువు ముగిసినా స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. పైగా, “పనులు పూర్తి కాలేదు, మరో 8 వారాల సమయం కావాలి” అని కోరుతూ స్పీకర్ కార్యదర్శి సుప్రీంలో మరో పిటిషన్ దాఖలు చేశారు.

సోమవారం ఈ పిటిషన్లపై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పీకర్ తీరుపై మండిపడింది. “సమయం ఇవ్వడం కుదరదు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. ఇది దారుణమైన కోర్టు ధిక్కరణ. ఈ విషయంపై ఆయన (స్పీకర్) వచ్చే నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే, తన కొత్త సంవత్సరాన్ని ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది” అంటూ సీజేఐ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యవహారంపై BRS నేతలు కేటీ రామారావు, పాడి కౌశిక్ రెడ్డి, కె.ఓ. వివేకానంద తదితరులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. “కొన్నింటిపై విచారణ పూర్తయింది, మరికొన్ని సాక్ష్య దశలో ఉన్నాయి” అని వారు చెప్పినా, ధర్మాసనం సంతృప్తి చెందలేదు. “నాలుగు వారాల్లో అన్నీ పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం” అని చెబుతూ, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

పదో షెడ్యూల్ ఒక ట్రిబ్యునల్..

పదో షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) కింద స్పీకర్ ఒక ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారని, ఆయనకు ‘రాజ్యాంగ రక్షణ’ ఉండదని సుప్రీంకోర్టు తన జూలై 31 తీర్పులోనే స్పష్టం చేసింది. అయినాసరే జాప్యం జరగడం “ఆలస్యం అమృతం విషం” అన్న చందంగా తయారైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దాదాపు 10 మంది BRS ఎమ్మెల్యేలు—దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస రెడ్డి, టి. ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, ఎం. సంజయ్ కుమార్, తెల్లం వెంకటరావు—కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సుప్రీం డెడ్‌లైన్‌తో స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తీవ్ర ఒత్తిడి పడింది.

Leave a comment