ప్రియదర్శి ‘మిత్ర మండలి’ ఓటీటీలోకి: విడుదలైన 20 రోజుల్లోనే స్ట్రీమింగ్!

నటుడు ప్రియదర్శి పులికొండ, సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక ఎన్.ఎమ్. ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ చిత్రం ‘మిత్ర మండలి’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఆశించిన విజయం సాధించకపోవడంతో కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

బాక్సాఫీస్ వద్ద వైఫల్యం, ట్రోలింగ్

నిజానికి, ఈ చిత్రం విడుదలైన ముందు ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీని కారణంగా సినిమాపై హైప్ కూడా పెరిగింది. అయితే, థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కథనం విషయంలో దర్శకుడు ఆసక్తి కలిగించలేకపోయారని విమర్శలు వచ్చాయి. కొన్ని సీన్లు స్లోగా, బోరింగ్‌గా ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంపై కొంతమంది పనిగట్టుకొని ఫేక్ ఐడీలతో ట్రోలింగ్ చేసినట్లు హీరో ప్రియదర్శి, నిర్మాత బన్నీ వాసు ఆరోపించారు. దాదాపు 300 ఫేక్ ఐడీలతో ట్రోలింగ్ జరిగిందని ప్రియదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేదు. ఈ సినిమా బడ్జెట్ 15 కోట్ల వరకు ఉండగా, 19.75 కోట్ల వరకూ వసూలు చేసింది.

ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకుంది. ఈ రెండింటి ద్వారా నిర్మాతలు దాదాపు ₹9.50 కోట్ల విలువైన డీల్ చేసుకున్నట్లు సమాచారం.

Leave a comment