అధికారం చేతిలో ఉంటే మాట తూలడం మామూలేనేమో! ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి చూస్తుంటే అలాగే అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో పరిశ్రమలు, పెట్టుబడుల గురించి గొప్పగా ప్రకటనలు చేసిన బాబు, అదే వేదికపై విశాఖ ఉక్కు కార్మికులపై నోరు జారారు. ఆంధ్రుల హక్కుగా భావించే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోవడానికి కార్మికుల సోమరితనమే కారణమనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే పెద్ద దుమారం చెలరేగింది. చేతిలో అపరిమితమైన అధికారం ఉంది కదా, ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతోనే చంద్రబాబు ఉన్నారని విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో కూడా, తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన నాయి బ్రాహ్మణులను ఉద్దేశించి “తోకలు కట్ చేస్తా” అంటూ వారి వృత్తిని అవమానించేలా మాట్లాడిన ఉదంతాన్ని పలువురు గుర్తుచేసుకుంటున్నారు. అధికారం ప్రశ్నించే వారినే కాదు, కనీసం సమస్యలు చెప్పుకునే వారిని కూడా సహించలేని స్థితికి తీసుకువస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వివాదం ముదరడంతో డ్యామేజ్ కంట్రోల్..!!
విశాఖ ఉక్కు ఉద్యమం బలంగా ఉన్న ఉత్తరాంధ్రలో ఈ వ్యాఖ్యలు టీడీపీకి తీవ్ర నష్టం చేస్తాయని గ్రహించిన పార్టీ నేతలు వెంటనే రంగంలోకి దిగారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక వీడియో విడుదల చేస్తూ, “బాబు మాటలను వక్రీకరించారు” అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, చంద్రబాబు ఆగ్రహాన్ని, అనుగ్రహాన్ని ప్రజలు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారా? అంటూ మీడియా, ప్రతిపక్షాలు ఈ వివరణను తిప్పికొడుతున్నాయి. ‘అన్నది ఆయనే, ఇప్పుడు కాదంటే ఎలా?’ అని జనం నిలదీస్తున్నారు.
ప్రైవేటీకరణకే బాబు మొగ్గు!
ఈ మొత్తం వివాదంలో మరో కీలక అంశం చంద్రబాబు ప్రైవేటీకరణ అనుకూల వైఖరి. “ఇంకా పెట్టని ప్రైవేట్ ఉక్కు ఫ్యాక్టరీ లాభాల్లో నడుస్తోంది” అని ఆయన అనడం, ఆయన దృష్టి ప్రభుత్వ రంగ సంస్థల కంటే ప్రైవేట్ వైపే ఉందని స్పష్టం చేస్తోందని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. విద్య, వైద్యం, పరిశ్రమలు.. ఇలా అన్నీ ప్రైవేట్‌కు కట్టబెట్టడమే చంద్రబాబు పాలనలో పరమావధి అని, కేవలం తమ పదవులను మినహాయించి అన్నింటినీ ప్రైవేట్‌పరం చేయడానికి ఆయన వెనుకాడరని వారు విమర్శిస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటేనని సీపీఐ నేత కె. రామకృష్ణ లాంటి వారు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా, ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో, టీడీపీకి తలనొప్పిగా మారే అవకాశం బలంగా కనిపిస్తోంది.

