8 ఏళ్ల మిస్టరీ వీడింది: ల్యాప్‌టాప్ సాక్ష్యంతో దొరికిన శశికళ హంతకుడు!

అమెరికాలోని న్యూజెర్సీలో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ప్రకాశం జిల్లా వాసి శశికళ నర్రా, ఆమె ఏడేళ్ల కుమారుడు అనీష్‌ల దారుణ హత్య ఉదంతం గుర్తుందా? ఇన్నాళ్లు ఆ కేసు ఒక అంతుచిక్కని మిస్టరీలా మిగిలిపోయింది. కానీ, ఇప్పుడు అమెరికా పోలీసులు వేసిన ఒకే ఒక్క ‘టెక్నికల్ స్కెచ్’తో అసలు హంతకుడు అడ్డంగా బుక్ అయ్యాడు.

అసలేం జరిగిందంటే.. 2017లో శశికళ, ఆమె కుమారుడు తమ అపార్ట్‌మెంట్‌లో దారుణంగా హత్య చేయబడ్డారు. అప్పట్లో అందరి వేళ్లు శశికళ భర్త హనుమంతరావు వైపే చూపించాయి. పాపం, కన్న బిడ్డను, కట్టుకున్న భార్యను పోగొట్టుకున్న బాధలో ఉన్న అతన్ని.. పోలీసులు, సమాజం అనుమానపు చూపులతో మరింత కృంగదీశాయి. కానీ, ఘటనా స్థలంలో దొరికిన ఒక చిన్న ‘రక్తపు చుక్క’ కథ మొత్తాన్ని మార్చేసింది. ఆ రక్తం హనుమంతరావుది కాదని తేలడంతో పోలీసులు అసలు వేట మొదలుపెట్టారు.

అక్కడే అసలు ట్విస్ట్! అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే హనుమంతరావు కొలీగ్, ‘నజీర్ హమీద్’ అనే వ్యక్తి మీద పోలీసుల కన్ను పడింది. ఈ హమీద్, హనుమంతరావు మీద పగ పెంచుకుని, అవకాశం కోసం చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అమెరికా పోలీసులు అనుమానించారు. కానీ, అప్పటికే హమీద్ అమెరికా నుండి చెక్కేసి ఇండియాలో సేఫ్‌గా సెటిల్ అయిపోయాడు. “నేను ఇండియాలో ఉన్నా, నా డీఎన్ఏ (DNA) మీకు ఎలా దొరుకుతుందిలే” అని ధీమాగా ఉన్నాడు.

కానీ అమెరికా పోలీసులు మామూలోళ్లు కాదుగా! హమీద్‌ పనిచేస్తున్న కాగ్నిజెంట్ ఆఫీస్ ల్యాప్‌టాప్‌ను టార్గెట్ చేశారు. కోర్టు ఆర్డర్‌తో ఆ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని, దాని కీబోర్డ్ మీద ఉన్న వేలి ముద్రలు, చిన్నపాటి కణాల ద్వారా డీఎన్ఏను సేకరించారు. ఆశ్చర్యకరంగా.. హత్య జరిగిన స్థలంలో దొరికిన రక్తపు చుక్కతో ఈ డీఎన్ఏ మ్యాచ్ అయ్యింది! ఇంకేముంది, 8 ఏళ్ల నరకం తర్వాత హంతకుడు ఎవరో తేలిపోయింది. ప్రస్తుతం హమీద్‌ను ఇండియా నుంచి తమకు అప్పగించాలని అమెరికా కోర్టు మన ప్రభుత్వాన్ని కోరింది.

టెక్నాలజీ ఉంటే నేరస్తుడు పాతాళంలో ఉన్నా పట్టుకోవచ్చు అని ఈ ఘటన నిరూపించింది.

Leave a comment