రాజకీయాలకు, వివాదాలకు దూరంగా ఉంటానని, కేవలం వ్యవసాయంపైనే దృష్టి పెడతానని ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీరులో మార్పు కనిపిస్తోంది. తాజాగా వైజాగ్‌లో జరిగిన CII భాగస్వామ్య సదస్సు విషయంలో ఆయన సీఎం చంద్రబాబుకు ట్విట్టర్ వేదికగా కీలక సూచనలు చేశారు. సదస్సులో కుదిరన ఒప్పందాలు (MOUs) కేవలం కాగితాలకు పరిమితం కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
పెట్టుబడుల గ్రౌండింగ్ కోసం వెంటనే ఒక ‘ప్రత్యేక అధికారి’ని నియమించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా, పారదర్శకత కోసం ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేలా ఒక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. “పది లక్షల కోట్ల పెట్టుబడుల్లో 75 శాతం గ్రౌండింగ్ అయినా ఏపీ రూపురేఖలు మారిపోతాయి. నెక్స్ట్ జనరేషన్ ఆంధ్రప్రదేశ్‌ను చూడాలని ఆశిస్తున్నా” అని ఆయన ట్వీట్ చేశారు.
గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసే విజయసాయి, ఇలా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వడం అటు టీడీపీ, ఇటు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన ఇప్పుడు ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా, ఒక బాధ్యతగల పౌరుడిగా స్పందిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ మార్పును నెటిజన్లు కూడా స్వాగతిస్తున్నారు.
విజయసాయి రెడ్డి తన పాత రాజకీయ పంథాను వీడి, రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్మాణాత్మక సూచనలు ఇస్తున్నారు. ఆయన చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

