బాలీవుడ్ ‘హీ-మ్యాన్’ ధర్మేంద్ర కన్నుమూత: సినీలోకంలో విషాదం.

బాలీవుడ్‌ మెగాస్టార్, ‘హీ-మ్యాన్’గా గుర్తింపు పొందిన ధర్మేంద్ర (89) సోమవారం ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం, నవంబర్ 12న డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోనే కోలుకుంటున్నారు. ఆయన మరణవార్తను సినీ ప్రముఖులు ధృవీకరించినప్పటికీ, డియోల్ కుటుంబం నుంచి మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వార్త వినగానే బాలీవుడ్‌లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

ధరమ్ సింగ్ డియోల్‌గా 1935, డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించారు. 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి ధర్మేంద్ర అడుగుపెట్టారు. 1966లో విడుదలైన ‘ఫూల్ ఔర్ పత్థర్’ సినిమాతో ఆయనకు అసలైన స్టార్‌డమ్ లభించింది. ముఖ్యంగా 1970లలో యాక్షన్ హీరోగా, రొమాంటిక్ స్టార్‌గా ఆయనకు తిరుగులేని స్టార్‌డమ్ వచ్చింది. ఆయన సహజమైన నటన, ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

భారతీయ సినీ చరిత్రలో రికార్డులు సృష్టించిన ఆల్-టైమ్ క్లాసిక్ ‘షోలే’ (1975) సినిమాలో వీరూ పాత్రను సినీ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ ఒక్క పాత్రతో ఆయన దేశవ్యాప్తంగా ఐకాన్‌గా మారారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ధర్మేంద్ర 300కు పైగా చిత్రాల్లో నటించారు. ‘సీతా ఔర్ గీతా’, ‘చుప్కే చుప్కే’, ‘ధరమ్ వీర్’ వంటి క్లాసిక్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. 2023లో వచ్చిన ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో కూడా నటించి మెప్పించారు.

సినిమాకు ఆయన చేసిన సేవలకుగానూ 1997లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, 2012లో దేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను అందుకున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా, ధర్మేంద్ర 2004 నుంచి 2009 వరకు రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి బీజేపీ ఎంపీగా కూడా సేవలు అందించారు. ధర్మేంద్రకు ప్రకాశ్ కౌర్, హేమమాలిని ఇద్దరు భార్యలు. నటులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌తో పాటు ఆరుగురు పిల్లలు ఆయనకు ఉన్నారు. ఈ లెజెండరీ నటుడి అస్తమయం భారతీయ సినిమాకు తీరని లోటు.

Leave a comment