మాస్ మహారాజా రవితేజ, యువ సంచలనం శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘మాస్ జాతర’. రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా రిలీజైన ఈ సినిమా ఓటీటీ డేట్‌ను లాక్ చేసుకుంది. థియేటర్లలో వచ్చి కనీసం నెల కూడా పూర్తి కాకముందే ఈ మూవీ డిజిటల్ స్క్రీన్ పైకి వస్తోంది.
భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. నవంబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలతో విడుదలైన ఈ చిత్రం సరిగ్గా 28 రోజులకు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతోంది.
నిజానికి, రిలీజ్‌కు ముందే ‘మాస్ జాతర’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రవితేజ, శ్రీలీల కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ, తీరా సినిమా చూసిన తర్వాత ఆడియన్స్‌కు నిరాశే ఎదురైంది.
థియేటర్లలో విడుదలైన తొలి షో నుంచే ఈ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చింది. రొటీన్ కథ, రొడ్డ కొట్టుడు స్క్రీన్ ప్లే, బోరింగ్ సన్నివేశాలతో దర్శకుడు భోగవరపు ఫ్యాన్స్‌ను విసిగించారు. రవితేజ ఎనర్జీ, రాజేంద్ర ప్రసాద్ కామెడీ (కొందరి ప్రకారం క్రింజ్) కూడా ప్రేక్షకులను నవ్వించలేకపోయాయి.
దీంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీస వసూళ్లు కూడా రాబట్టలేక డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ మధ్యకాలంలో రవితేజ మార్కెట్‌కు ఇది మరో గట్టి ఎదురుదెబ్బ. అయితే, థియేటర్లలో బాగా ఆడకపోయినా, ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్‌కు ముందే భారీ ధర చెల్లించి దక్కించుకుంది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవితేజ ఇందులో ధైర్యవంతుడైన రైల్వే ఎస్ఐ లక్ష్మణ్ భేరీ పాత్రలో నటించారు. నవీన్ చంద్ర విలన్‌గా నటించగా, శ్రీలీల కాలేజీ అమ్మాయిగా కనిపించింది.
థియేటర్లలో రవితేజ మాస్ జాతర ఫెయిల్ అయినా.. ఓటీటీలోనైనా మెప్పించి, నెట్‌ఫ్లిక్స్ పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబడుతుందో లేదో చూడాలి. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. మొత్తానికి, థియేటర్ వినోదం కన్నా..ఓటీటీలో ఈ రైల్వే ఎస్ఐ చేసే యాక్షన్ ఎక్కువ మందికి చేరే అవకాశం దక్కింది!

