చేపలకు విషం.. హైదరాబాద్ చికెన్ వ్యర్థాల మాఫియా పట్టివేత!

గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో భారీ చికెన్ వ్యర్ధాల సరఫరా రాకెట్ బట్టబయలైంది. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్న చీకటి దందా.

అత్తాపూర్ సమీపంలోని పౌల్ట్రీ యూనిట్ల నుంచి ప్రతిరోజూ వచ్చే వేలాది టన్నుల కూలిన చికెన్ వ్యర్థాలను  నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు తరలిస్తున్న ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు.

సాధారణంగా, పౌల్ట్రీ వ్యర్థాలను సేకరించి, శుభ్రపరిచి, సైంటిఫిక్ పద్ధతిలో ప్రాసెస్ చేయడానికి జీహెచ్ఎంసీ పరిధిలో రెండరింగ్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్లలో వ్యర్థాలను ఉపయోగించి సురక్షితమైన ఆక్వా ప్రోటీన్ ఉత్పత్తులను తయారుచేస్తారు. కానీ, ఈ మాఫియా ముఠా సభ్యులు.. రెండరింగ్ ప్లాంట్‌కు ఇవ్వాల్సిన వ్యర్థాలను పక్కదారి పట్టించారు. కేవలం అధిక లాభాల కోసం నేరుగా ఏపీలోని ఒంగోలు, భీమవరం వంటి ప్రాంతాల్లోని చేపల వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

ఈ అక్రమ కార్యకలాపాలపై ఓ స్వచ్ఛంద సంస్థ నిఘా ఉంచి, పోలీసులకు పక్కా సమాచారం అందించింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హైజీన్ ప్రమాణాలు పాటించకుండా, ఎలాంటి అనుమతులూ లేకుండా, పూర్తిగా కుళ్లిపోయిన వ్యర్థాలతో నిండిన లారీలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

చేపల చెరువుల్లో మేత ఖర్చును గణనీయంగా తగ్గించుకునేందుకు కొంతమంది అక్వా వ్యాపారులు ఈ కుళ్లిపోయిన వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ అశాస్త్రీయ విధానంలో తరలించే వ్యర్థాలలో సాల్మొనెల్లా , ఇ.కోలి  వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలతో పాటు యాంటీబయాటిక్ అవశేషాలు, విష రసాయనాలు ఉండే ప్రమాదం ఉంది.

ఈ మురికి మేతతో పెరిగే చేపలను వినియోగిస్తే ప్రజలకు తీవ్రమైన జీర్ణకోశ సమస్యలు, ఇతర ఆరోగ్య ప్రమాదాలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ ఎదుగుదల కోసం డబ్బుకు కక్కుర్తి పడుతున్న కొందరి స్వార్థం, రెండు రాష్ట్రాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.

ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరు ప్రమేయం ఉన్నారనే దానిపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. స్వచ్ఛమైన ఆహారం పేరుతో విషాన్ని అమ్ముతున్న ఈ మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a comment