తమన్‌కు తప్పని ‘రొటీన్’ పాటల తిప్పలు! ఫ్యాన్స్ ఫైర్.

టాలీవుడ్‌లో ప్రస్తుతం నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్న ఎస్.ఎస్. తమన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆయన సంగీతం అందించిన రెండు భారీ సినిమాల పాటలు అభిమానులను పూర్తిగా నిరాశ పరిచాయి. తమన్ ఇచ్చిన అవుట్‌పుట్ పట్ల సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి.

ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమాలోని ‘జాజికాయ’ సాంగ్, అలాగే యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ నుంచి విడుదలైన మొదటి సింగిల్ ‘రెబెల్ సాబ్’ ఆశించిన స్థాయిలో లేవని నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు. ఈ పాటలు అస్సలు బాలేదంటూ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

నిజానికి, తమన్ కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాకు అందించిన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) చూసి టాలీవుడ్ మొత్తం ఆశ్చర్యపోయింది. తమన్ తన పంథా మార్చుకున్నారని అంతా అనుకున్నారు. కానీ, ఈ తాజా పాటలు విన్న తర్వాత, తమన్ మళ్లీ రొటీన్ బాట పట్టారని, ఎక్కడా కొత్తగా ప్రయత్నించలేదని కామెంట్స్ చేస్తున్నారు. “రొటీన్ ట్యూన్స్ తప్ప కొత్తగా ఏముంది మా హీరోకి?” అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

తమన్ ఎప్పుడూ ‘సాఫ్ట్ టార్గెట్’గానే ఉంటారన్న పేరు ఉంది. గతంలో రామ్ చరణ్ సినిమా ‘గేమ్ చేంజర్’ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్‌కు కోపం తెప్పించాయి. ఇప్పుడు మళ్ళీ స్టార్ హీరోల ఫ్యాన్స్ నుంచే వ్యతిరేకత రావడంతో, తమన్ మరింత చిక్కుల్లో పడ్డారు. పెద్ద సినిమాలకు సంగీతం ఇచ్చేటప్పుడు కచ్చితంగా అంచనాలను అందుకోవాల్సిన బాధ్యత తమన్‌పై ఉంది.

మరోవైపు, ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ సాంగ్ వంద కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఏఆర్ రెహమాన్ అందించిన ఆ పాటతో పాటు, చిరంజీవి గారి ‘మీసాల పిల్లా’ పాట కూడా భారీ హిట్‌గా నిలిచింది. ఇంతటి గట్టి పోటీ మార్కెట్‌లో ఉన్నప్పుడు, తమన్ నుంచి పోటీనిచ్చే మాస్ మ్యాజిక్ రాకపోవడం అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. తమన్ తన స్టైల్‌ని, సౌండ్ మిక్సింగ్‌ని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a comment