మరో రెండు రోజుల్లో సెన్‌యార్ తుఫాన్! ఏపీకి 5 రోజులు అతి భారీ వర్షాలు.

ఆంధ్రప్రదేశ్‌పై ప్రకృతి పగబట్టిందా అన్నట్లుగా వాతావరణం మారిపోయింది. మొంథా తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి రైతులు, తీర ప్రాంత ప్రజలు ఇంకా కోలుకోలేదు. అప్పుడే బంగాళాఖాతంలో మరో పెను ప్రమాదం పొంచి ఉంది. బలమైన అల్పపీడనం ఏకంగా తుఫాన్‌గా మారబోతోంది. దీనికి ‘సెన్‌యార్’ అని పేరు పెట్టారు.

సెన్‌యార్ అంటే అరబిక్‌లో ‘సింహం’ అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఇది తీర ప్రాంతాలకు సింహస్వప్నంలా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది. ఈ వాతావరణ వ్యవస్థ నవంబర్ 24 నాటికే తీవ్ర వాయుగుండంగా మారింది. రేపు (నవంబర్ 26) నాటికి ఇది పూర్తిస్థాయి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.

ఈ సెన్‌యార్ తుఫాన్ పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. ఇది ప్రధానంగా తమిళనాడు తీర ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా జిల్లాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

మరోవైపు, శ్రీలంక సమీపంలో, కొమరిన్ ప్రాంతంలో ఇంకో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతోంది. ఈ రెండు వాతావరణ పరిస్థితుల వల్ల సెన్‌యార్ మరింత బలం పుంజుకునే ఛాన్స్ ఉంది. ఈ పరిస్థితులన్నీ ఏపీ రైతులకు పెద్ద తలనొప్పిగా మారాయి. మొన్నటి మొంథా తుఫాన్‌కు చేతికొచ్చిన పంటంతా నీటమునిగి కోట్లు నష్టపోయారు. ఇప్పుడు సెన్‌యార్ రూపంలో మరో ముప్పు వచ్చింది.

అందుకే, రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంటలను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. తీర ప్రాంతంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశం ఉన్నందున, నవంబర్ 27 నుంచి 30 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు గట్టిగా హెచ్చరించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు, అధికారులు ఇచ్చే సూచనలను తప్పకుండా పాటించాలి. నిన్న మొన్నటి వరకు చలితో వణికిపోయిన ఏపీ ఇప్పుడు మళ్లీ తుఫాన్ వర్షాలతో చిగురుటాకులా వణకనుంది. ప్రతి ఒక్కరూ తాజా అప్‌డేట్‌లను గమనించాలి.

Leave a comment