నిర్మాతలకు 17% మాత్రమే! టికెట్ ధరల అసలు లెక్క ఇదే – SKN

సినిమా టికెట్ ధరలపై తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా, ‘హై రేట్స్’ అంటూ ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తుంటాయి. అయితే, ఈ విమర్శలకు ఇప్పుడు నిర్మాత ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్) గట్టి కౌంటర్ ఇచ్చారు. సినిమా టికెట్లపై వచ్చే మొత్తంలో నిర్మాతలు అనుకుంటున్నంత లాభాలు పొందట్లేదనే అసలు సత్యాన్ని ఆయన బయటపెట్టారు.

ఒక ఫ్యామిలీ సినిమా చూడటానికి మల్టీప్లెక్స్‌కు వెళ్తే, వారి నుంచి వసూలు అయ్యే మొత్తం ఖర్చులో నిర్మాతలకు వాటా ఎంత ఉంటుందో లెక్కలతో సహా ట్వీట్ చేశారు ఎస్కేఎన్. ఈ వివరాలు చూస్తే సినిమా వ్యాపారంలో నిర్మాతల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది.

రూ. 2200 ఖర్చులో వాటాదారులెవరు?

ఎస్కేఎన్ షేర్ చేసిన బ్రేక్‌డౌన్ ప్రకారం, నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం మల్టీప్లెక్స్‌లో సినిమా చూసినప్పుడు వారికి సగటున ₹2,200 ఖర్చు అవుతుందట. ఈ మొత్తం ఖర్చులో అసలు నిర్మాతకు ఎంత వస్తుందంటే, కేవలం ₹372 మాత్రమే! అంటే, మొత్తం వసూళ్లలో నిర్మాతకు దక్కే నికర వాటా 17.08% మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. రూపాయికి 17 పైసలు మాత్రమే మాకు వస్తుందనేది ఆయన వాదన.

మరి, మిగిలిన డబ్బు ఎవరికి వెళ్తోంది? ఈ లెక్కల్లో ఎక్కువ భాగం థియేటర్లకే పోతోంది.

  • మల్టీప్లెక్స్ షేర్ (ఫుడ్, మెయింటెనెన్స్, సర్వీస్ ఛార్జీలు): ₹1,545.
  • ప్రభుత్వ పన్ను (జీఎస్టీ): ₹182.
  • బుక్‌మైషో కన్వీనియన్స్ ఫీజు: ₹78 (ఇది 3.61% వాటా).

నిజానికి, మల్టీప్లెక్స్ తీసుకుంటున్న ₹1,545 లో పాప్‌కార్న్, సమోసా, కూల్‌డ్రింక్స్ వంటి ఫుడ్ అండ్ బెవరేజెస్ (F&B) ఛార్జీలు, మెయింటెనెన్స్ ఛార్జీలు ఇమిడి ఉంటాయి. ఈ ఆదాయంతో సినిమా నిర్మాతలు, పంపిణీదారులకు ఏమాత్రం సంబంధం ఉండదు. అందుకే, ప్రేక్షకులు ఖర్చు చేసే మొత్తంలో అత్యధిక వాటా (సుమారు 70%) థియేటర్ యజమానులకే దక్కుతోంది.

సినిమా తీయడానికి అప్పులు చేసి, భారీ రిస్క్ భరించి, సాంకేతిక నిపుణులకు రెమ్యునరేషన్లు చెల్లించిన నిర్మాతలు, లాభం వస్తే కేవలం 17% వాటా మాత్రమే తీసుకోవడం ఇండస్ట్రీలో ఉన్న వాస్తవం. నష్టాలొస్తే మాట్లాడకుండా ఒంటరిగా భరించే నిర్మాతలు, లాభాలొస్తే మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నారని SKN తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై, టికెట్ రేట్లపై విమర్శించే ముందు, మల్టీప్లెక్స్ ఫుడ్ రేట్ల గురించి కూడా మాట్లాడాలని ఆయన పరోక్షంగా సూచించారు.

Leave a comment