దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి ఇపుడు కొత్త తలనొప్పి మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన జక్కన్నకు హనుమంతుడి భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం ఎదురవుతోంది. దీనికి కారణం.. ఇటీవల ఆయన ప్రకటించిన మహేష్ బాబు సినిమా ‘వారణాసి’ ఈవెంట్.
ఈ ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. సినిమా టైటిల్, మహేష్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అయితే, టెక్నికల్ సమస్యల కారణంగా ఈ గ్లింప్స్ వీడియో ప్లే అవ్వలేదు. దీంతో రాజమౌళి కాస్త ఎమోషనల్ అయ్యారు.
ఆవేశంలోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. “నాకు దేవుళ్లపై పెద్దగా నమ్మకం లేదు. నాన్నగారు (విజయేంద్ర ప్రసాద్) హనుమంతుడు మనల్ని నడిపిస్తాడు అన్నారు. కానీ, ఇలాంటి గ్లిచ్ వచ్చినపుడు, ‘ఇదేనా నడిపించడం?’ అని నాన్నను, హనుమాన్ భక్తురాలైన నా భార్యను కూడా అడిగాను” అని చెప్పినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. ఈ మాటలు హిందూ సంఘాలను తీవ్రంగా హర్ట్ చేశాయి.
వెంటనే ‘వానర సేన’ వంటి హిందూ సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. రాజమౌళి హిందూ మనోభావాలను దెబ్బతీశారని, ఆయన సినిమాలను బ్యాన్ చేయాలని డిమాండ్లు పెరిగాయి. క్షమాపణ చెప్పాలని ఒత్తిడి వచ్చింది.
కానీ, జక్కన్న రూటే వేరు. ఇంత పెద్ద రచ్చ జరుగుతున్నా, ఆయన అస్సలు నోరు విప్పలేదు. కామెంట్స్‌పై స్పందించలేదు. దాని బదులు, వివాదం నడుస్తున్న సమయంలోనే ‘వారణాసి’ ఈవెంట్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.
ఆ వీడియోలో ఈవెంట్ కోసం టీమ్ ఎంత కష్టపడింది, మహేష్ బాబు ఎద్దు బొమ్మపై వచ్చే ఎంట్రీ సీన్ కోసం ఎంత ప్రాక్టీస్ చేశారో చూపించారు. తెరపై గ్లింప్స్ ప్లే కాకపోవడంతో తాను ఎంత అసంతృప్తికి గురయ్యానో పరోక్షంగా చూపించేందుకే ఈ వీడియో పెట్టారని కొందరు అంటున్నారు.
అంటే, “విమర్శలు చేస్తారా? ఇంత కష్టం చేశాను. అందుకే ఆవేశపడ్డాను” అని చెప్పకనే చెప్పారన్నమాట! రాజమౌళి క్షమాపణ చెప్పేందుకు రెడీగా లేరని, ఈ మేకింగ్ వీడియోతో వివాదాన్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మొత్తానికి, ‘వారణాసి’ సినిమా రిలీజ్‌కు ఇంకా చాలా టైమ్ ఉన్నా.. ఇప్పుడే పెద్ద రచ్చ మొదలైంది.

