మైత్రీ మూవీ మేకర్స్ చేతికి మలయాళ WWE యాక్షన్ మూవీ!

తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ హవా నడుస్తోంది. పెద్ద హీరోలతో భారీ చిత్రాలను నిర్మిస్తూనే, మంచి కంటెంట్ ఉన్న ఇతర భాషల సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందించి విజయాలు సాధిస్తున్నారు.

వారి లేటెస్ట్ ఎంపిక మలయాళ చిత్రం. తాజాగా, మలయాళంలో మొట్టమొదటి పూర్తి నిడివి గల WWE జానర్ యాక్షన్-కామెడీ చిత్రం “చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్”  ను తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ హక్కులు తీసుకుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను జనవరి 2026లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి యువ దర్శకుడు అద్వైత్ నాయర్ దర్శకత్వం వహించారు. ఆయన ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌కు మేనల్లుడు కావడం విశేషం. ప్రముఖ దర్శక నిర్మాతల వద్ద పని చేసిన అనుభవంతో అద్వైత్ నాయర్ ఈ పవర్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, విశాఖ్ నాయర్, ఇషాన్ షౌక్కత్ వంటి టాలెంటెడ్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా కథాంశం కొచ్చిలోని ఒక అండర్‌గ్రౌండ్ రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో సాగుతుంది. WWE స్టార్స్ స్ఫూర్తితో.. గ్యాంగ్‌స్టర్ గొడవల్లో చిక్కుకున్న కొంతమంది యువకుల కథను కామెడీ, యాక్షన్ మేళవింపుతో చూపించబోతున్నారు. దీని టీజర్ ఇప్పటికే విడుదలై అంచనాలు పెంచేసింది.

ఈ మూవీ కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది ఏకంగా పాన్-ఇండియా రేంజ్‌లో రిలీజ్ కాబోతోంది. నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులను బాలీవుడ్‌లోని బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్  దక్కించుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కేరళలో దుల్కర్ సల్మాన్ నేతృత్వంలోని వేఫేరర్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది. తమిళనాడు, కర్ణాటకలో పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ రిలీజ్ చేస్తోంది.

ముఖ్యంగా, ప్రముఖ బాలీవుడ్ సంగీత త్రయం శంకర్-ఎహ్సాన్-లాయ్ ఈ సినిమాతోనే మలయాళ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టడం మరో పెద్ద హైలైట్. ప్రపంచవ్యాప్తంగా 115 కంటే ఎక్కువ దేశాలలో విడుదల కానున్న ఈ సినిమాకు, మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా తెలుగులో మంచి హైప్ దక్కడం ఖాయం.

Leave a comment