కర్ణాటక పాలిటిక్స్: ఢిల్లీ పిలుపు లేదు, ముంబైకి జంప్? డీకే శివకుమార్ కొత్త ట్విస్ట్!

కర్ణాటక కాంగ్రెస్‌లో ‘కుర్చీలాట’ క్లైమాక్స్ దశకు చేరుకుంది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సిద్ధరామయ్య , డీకే శివకుమార్  మధ్య జరిగినట్లు ప్రచారంలో ఉన్న “అండర్‌స్టాండింగ్” ఒప్పందానికి గడువు తీరిపోయింది. సరిగ్గా 2.5 ఏళ్ల తర్వాత (నవంబర్ 2025 నాటికి) సీఎం సీటు మారుతుందన్న ప్రచారం ఇప్పుడు బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు సెగలు పుట్టిస్తోంది.

ఈ హైడ్రామా మధ్యలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓ కొత్త బాంబ్ పేల్చారు. సీఎం మార్పు విషయంపై బహిరంగంగా మాట్లాడనంటూనే.. “మా మధ్య ఓ సీక్రెట్ డీల్ ఉంది.. అది కేవలం ఐదు, ఆరుగురికి మాత్రమే తెలుసు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సిద్ధరామయ్య వర్గంలో గుబులు మొదలైంది. మరోవైపు డీకే వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేసి హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తుంటే, డీకే మాత్రం కూల్‌గా “నన్నెవరూ ఢిల్లీకి పిలవలేదు, నేను ఓ ప్రైవేట్ పనిపై ముంబై వెళ్తున్నా” అని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. డీకే శివకుమార్ వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారా? ఆయన ట్విట్టర్ ఖాతాలో “మాట నిలబెట్టుకోవడమే ప్రపంచంలో అతిపెద్ద శక్తి” అంటూ వచ్చి, వెంటనే మాయమైన పోస్ట్ వెనుక మర్మమేంటి? సిద్ధరామయ్య మాత్రం “ఐదేళ్లు నేనే ఉంటా” అని ధీమాగా చెబుతున్నా, అధిష్టానం నవంబర్ 29న నిర్వహించబోయే కీలక భేటీలో ఏం జరగబోతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి కన్నడ నాట కాంగ్రెస్ రాజకీయం “ఢిల్లీలో దోస్తీ.. బెంగళూరులో కుస్తీ” లా తయారైంది.

Leave a comment