లోకేష్ కనగరాజ్ షాకింగ్ డెసిషన్.. ‘ఖైదీ 2’ లేనట్టేనా? ఫ్యాన్స్ హర్ట్!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘మానగరం’ నుంచి మొన్నటి రజినీకాంత్ ‘కూలీ’ వరకు ఆయన ప్రతి సినిమా ఒక సెన్సేషనే. అయితే, ఎప్పటి నుంచో ఊరిస్తున్న ‘ఖైదీ 2’  ప్రాజెక్ట్ విషయంలో లోకేష్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కార్తీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఖైదీ’కి సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని LCU  ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కానీ, లోకేష్ మాత్రం ఆశలపై నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది.

రీసెంట్‌గా రజినీకాంత్‌తో లోకేష్ తెరకెక్కించిన ‘కూలీ’ ఆగస్టులో విడుదలై మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. ఆశించిన స్థాయిలో మ్యాజిక్ క్రియేట్ చేయలేదన్న టాక్ వినిపించింది. దీంతో లోకేష్ తన తదుపరి అడుగుపై ఆచితూచి వ్యవహరిస్తున్నారట.

వాస్తవానికి ‘కూలీ’ తర్వాత వెంటనే ‘ఖైదీ 2’ పట్టాలెక్కాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం, లోకేష్ ఈ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టి.. స్ట్రెయిట్ తెలుగు సినిమా  చేసేందుకు రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌లో లోకేష్ తన తదుపరి సినిమాను చేయబోతున్నారని, ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించే ఛాన్స్ ఉందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే టాలీవుడ్ ఫ్యాన్స్‌కి పండగే కానీ, ఎల్సీయూ లవర్స్ మాత్రం ఇంకొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు.

 ఇదిలా ఉంటే, లోకేష్ కనగరాజ్ ఇప్పుడు కేవలం డైరెక్టరే కాదు, యాక్టర్ కూడా. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ (DC)లో లోకేష్ హీరోగా నటిస్తున్నారు. ఇలా వరుస కమిట్‌మెంట్స్ వల్ల ‘ఢిల్లీ’ (Dilli) పాత్రను ఇప్పట్లో వెండితెరపై చూడటం కష్టమేనని ఇన్ సైడ్ టాక్.

ఏది ఏమైనా, ‘విక్రమ్’ సినిమాతో పీక్స్‌కి వెళ్లిన అంచనాలను అందుకోవాలంటే ‘ఖైదీ 2’ పర్ఫెక్ట్ టైమ్‌లో రావాలి. కానీ ఈ డిలే చూస్తుంటే.. అసలు సినిమా ఉందా? లేక అటకెక్కిందా? అనే సందేహాలు కలగకమానవు.

Leave a comment