నిన్నటి వరకు ‘సెన్వార్’ తుపాను భయంతో వణికిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆ ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకునేలోపే, బంగాళాఖాతంలో ‘దిత్వా’ రూపంలో మరో కొత్త గండం తయారైంది. యెమెన్ దేశం సూచించిన ఈ పేరు వెనుక.. సోకోట్రా దీవిలోని ఓ అందమైన సరస్సు చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు ఇది ఏపీ తీరానికి భయాన్ని పరిచయం చేస్తోంది!
అసలేం జరుగుతోంది?
ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు దగ్గరగా కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ఇది చకచకా ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం (నవంబర్ 30) నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ఆంధ్రా తీరాలకు అత్యంత సమీపంలోకి రానుంది. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి మంగళవారం వరకు రాష్ట్రం తడిసిముద్దవ్వడం ఖాయమని ఐఎండీ (IMD) హెచ్చరించింది.
జిల్లాల వారీగా హై అలర్ట్ (IMD Forecast):
శుక్రవారం (Nov 28): నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు మొదలవుతాయి. గాలుల తీవ్రత పెరుగుతుంది.
శనివారం (Nov 29 – Orange Alert): నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ప్రకాశం, కడప, బాపట్ల, సత్యసాయి జిల్లాల్లోనూ దంచికొట్టే వానలు పడతాయి.
ఆదివారం (Nov 30 – Red Alert): పరిస్థితి మరింత తీవ్రం! చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ అయ్యింది. ఇక్కడ అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇక గుంటూరు, పల్నాడు, నంద్యాల జిల్లాల్లోనూ వాన దరువు గట్టిగానే ఉంటుంది.
సోమవారం (Dec 1): కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గోదావరి జిల్లాల్లోనూ మోస్తారు వానలు పలకరించవచ్చు.
గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. రైతులు పంటల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ సూచించింది.
మొత్తానికి ‘దిత్వా’ ఎఫెక్ట్ తో ఈ వీకెండ్ ఏపీ ప్రజలకు వానల జాతరే! బయటకు వెళ్లేముందు గొడుగు మర్చిపోవద్దు, అప్రమత్తంగా ఉండండి.

